వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీతో కలసి పొత్తులు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఎలాంటి అవకాశాలు వచ్చినా టీడీపీ వదులుకోవడానికి సిద్ధంగా ఉండదనే చెప్పాలి.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఉత్తరాంధ్రాలో సిట్టింగ్ ఎమ్మెల్సీగా బీజేపీ సీనియర్ నేత పీవీఎన్ మాధవ్ ఉన్నారు. ఆయన 2017 ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో గెలిచారు. అప్పట్లో కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ టీడీపీ మిత్రులుగా ఉన్నారు. ఆ తరువాత ఎవరి దారి వారిదైంది.
ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా మరోమారు బీజేపీ తరఫున మాధవ్ రెండవసారి పోటీకి దిగుతారు అని తెలుస్తోంది. బీజేపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత ఓటు బ్యాంక్ ఉంది. టీడీపీ 2007లో ఒంటరిగా పోటీ చేసినా గెలిచినది లేదు. దీంతో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీడీపీ ఈసారికి బీజేపీకి మద్దతు ఇస్తుందా అన్నదే హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది.
అధికార వైసీపీ అభ్యర్ధిగా సుధాకర్ బరిలో ఉన్నారు. వామపక్షాల సంఘటన తరఫున కూడా ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించారు. బీజేపీ టీడీపీ కలిస్తే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. విడిగా చేస్తే ఇద్దరికీ ఇబ్బందే అన్నది రెండు పార్టీలోనూ అనుకుంటున్న విషయంగా చెబుతున్నారు. అయితే బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తు లేదని ఇప్పటికి చాలా సార్లు చెబుతూ వచ్చారు.
దాంతో టీడీపీ తన అభ్యర్ధిని నిలబెట్టకుండా పరోక్షంగా బీజేపీని మద్దతు ఇవ్వడం ద్వారా వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తుందా అన్నదే ఒక ప్రచారంగా ముందుకు వస్తోంది. టీడీపీ పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం అది బీజేపీ కోసమే అని అంతా అనుకునే పరిస్థితి ఉంది.
అన్ని చోట్లా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఈసరికే ప్రకటించిన టీడీపీ ఉత్తరాంధ్రా విషయంలో ఇప్పటిదాకా ఎంపిక చేయకపోవడంతోనే అనుమానాలు కలుగుతున్నాయని అంటున్నారు. రేపటి పొత్తుల కోసం టీడీపీ వేసే ఎత్తుగడలు ఏంటి అన్నవి ఈ ఎన్నికల ద్వారా తెలుస్తాయని అంటున్నారు.