ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద మనసుతో వ్యవహరించారు. తన మానస పుత్రిక సచివాలయ వ్యవస్థ ఉద్యోగులకు సంబంధించి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రొబేషన్ డిక్లేర్ కాకపోయినా, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వివధ కారణాల వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్ద మనసుతో నిర్ణయం తీసుకున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు కాకర్ల వెంకట రామిరెడ్డి తెలిపారు.
ఇప్పటి వరకు వివిధ కారణాల వల్ల దాదాపు 200 మంది సచివాలయ ఉద్యోగులు చనిపోయారని ఆయన తెలిపారు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రజలకు సేవలందించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయలేదని పేర్కొన్నారు. చనిపోయే నాటికి సదరు ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ కాలేదని, సర్వీస్ నిబంధనల ప్రకారం కారుణ్య నియామకాలకు అవకాశం లేకుండా పోయిందని వెంకటరామిరెడ్డి వెల్లడించారు.
అయితే సర్వీస్ నిబంధనలను సడలించి చనిపోయిన గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఫైల్‌పై ఇవాళ సీఎం సంతకం చేయనున్నారు.
రెండుమూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకుని ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.