వారసులకు టికెట్లు ఇవ్వనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంత? అనే చర్చకు తెరలేచింది. నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో, వారసులకు టికెట్లు ఇవ్వనని చెప్పడంలో కూడా అంతే వాస్తవం ఉందని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమంలో వారసులు పాల్గొనడాన్ని మాత్రమే జగన్ అభ్యంతరం చెప్పారని వారు అంటున్నారు.
ఎమ్మెల్యేలే స్వయంగా గడపగడపకూ కార్యక్రమంలో పాల్గొనాలని జగన్ స్పష్టం చేశారని వారు అంటున్నారు. అంతే తప్ప, వారసులందరికీ టికెట్లు ఇవ్వనని జగన్ చెప్పలేదని వారు అంటున్నారు. ఇప్పటికే కొందరు వారసులకు జగన్ 2024 ఎన్నికల్లో టికెట్లను ఖరారు చేశారని సమాచారం. ఉదాహరణకు మాజీ మంత్రి పేర్ని నాని ఇప్పటికే పలుమార్లు తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, వీలైతే తన కుమారుడు పేర్ని కిట్టుకు టికెట్ ఇవ్వాలని జగన్ కోరారు.
అయితే పేర్ని కిట్టు వయసు రీత్యా ఇప్పుడిప్పుడే ఎన్నికల్లో పోటీ చేసే వయసుకు వచ్చారని, ఇంకా రాజకీయ అనుభవం సంపాదించాల్సి వుందనేది జగన్ అభిప్రాయం. అందుకే ఈ దఫా మీరే పోటీ చేయాలని పేర్ని నానికి జగన్ స్పష్టంగా చెప్పారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అదే విషయాన్ని మరోసారి జగన్ ఇటీవల సమావేశంలో స్పష్టం చేశారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ దఫా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని జగన్ తేల్చి చెప్పినట్టు సమాచారం. ముఖ్యంగా మైనార్టీ మహిళలకు పార్టీలో ప్రాధాన్యం పెంచేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
కానీ తానే పోటీ చేస్తానని ముస్తఫా కోరినా, జగన్ వినిపించుకోలేదని తెలిసింది. ముస్తఫా కుమార్తె ఫాతిమా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చురుగ్గా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే తిరుపతి విషయానికి వస్తే ఎమ్మెల్యే కరుణాకరెడ్డి తనయుడు అభినయ్ ఆ నియోజకవర్గంలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నారు. ప్రస్తుతం ఆయన తిరుపతి డిప్యూటీ మేయర్ కూడా. నియోజకవర్గంలో తలలో నాలుకలా అతను వ్యవహరిస్తున్నారు. అతన్ని వారసుడిగా భావించి జగన్ టికెట్ ఇవ్వని పరిస్థితి వుండకపోవచ్చని రాజకీయ వర్గాల అభిప్రాయం.
ఇలా వారసుల్లో జవసత్వాలున్న యువనాయకుల్ని జగన్ ఎట్టి పరిస్థితుల్లో పక్కన పెట్టే పరిస్థితి వుండదని వైసీపీలో అంతర్గత చర్చ సాగుతోంది. కేవలం వైసీపీ నేతల్లో అయోమయాన్ని సృష్టించేందుకే ఎల్లో మీడియా వారసులపై వ్యతిరేక కథనాలు వండివార్చుతోందని వైసీపీ ప్రజాప్రతినిధుల అభిప్రాయం. ఉదాహరణకు మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడికి రాజకీయాలంటే ఆసక్తి లేదు. బొత్స కుమారుడు వృత్తిరీత్యా డాక్టర్, కుమారుడికి ఆసక్తి లేకుండా బొత్స ప్రోత్సహించే పరిస్థితి లేదు. అందుకే తన కుమారుడి టికెట్ విషయమై బొత్స ఎప్పుడూ మాట్లాడరు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డి తమ నియోజకవర్గాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో వయసు రీత్యా బియ్యపు మధు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డే చిన్నవాళ్లు. అలాంటప్పుడు వారి వారసులకు టికెట్లు ఆశిస్తారని ఎవరూ ఊహించరు. తమ తండ్రులకు రాజకీయంగా అండగా నిలిచేందుకే నియోజకవర్గాల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్న మాట నిజం.
తండ్రులను కాదని తమకే టికెట్లు కావాలని పట్టుపట్టే వారసులు వైసీపీలో ఎవరూ ఉండకపోవచ్చు. పార్టీకి మంచిదని భావిస్తే ఎవరినైనా ప్రోత్సహించడానికి జగన్ వెనుకాడరు. తాజాగా వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్‌కు జగనే అప్పగించిన సంగతిని ఎలా చూడాలి? మరి ఇది వారసత్వం పరిధిలోకి రాదా? జగన్‌కు జవసత్వాలే తప్ప వారసత్వాలు ఏ మాత్రం పట్టవని గుర్తించుకోవాలి.