ఎన్నికల ప్రచారంలో ఎన్నో హామీలిచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఎంత ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. అయితే ఈ క్రమంలో జగన్ నెరవేర్చిన ఓ హామీ.. సామాన్యులకు భారంగా మారింది. అదే ఆర్టీసీని విలీనం చేయడం. ఆర్టీసీ ఉద్యోగులందర్నీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తానని జగన్ హామీ ఇచ్చారు.
చెప్పినట్టే నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. అయితే ఈ విలీనమే ఇప్పుడు సామాన్య ప్రయాణికుడికి శాపమైంది. ప్రస్తుతం ఆర్టీసీ పనితీరుపై ఓ సామాన్య ప్రయాణికుడి రోదన ఇది.
– ఒకప్పుడు చేయి ఎత్తితే బస్సు ఆగేది.
ఎక్కడ చేయి ఎత్తినా బస్సు ఆగేది. ప్రయాణికుడ్ని ఎక్కించుకోవడానికి డ్రైవర్, కండక్టర్ ఉత్సాహం చూపించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెయ్యి ఎత్తినా బస్సు ఆగడం లేదు. ఆక్యుపెన్సీ, టార్గెట్ ఊసే లేదు. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఉద్యోగులే.
– అప్పటి షెడ్యూలింగ్ ఇప్పుడేది?
ఉదయం 5.30 నుంచే బస్సులు మొదలయ్యేవి. ఇప్పుడు అరకొరగానే కనిపిస్తున్నాయి. సాయంత్రం 7 దాటితే పట్టణాల నుంచి పల్లెలకు దాదాపు బస్సులు కట్. షెడ్యూలింగ్ అధ్వాన్నంగా ఉంది. ఒకేసారి 2-3 బస్సులు వచ్చేస్తాయి, లేదంటే ఒక్కటి కూడా రాదు.
ఇక సాయంత్రమైతే తమ పల్లెకు బస్సు ఉంటుందా ఉండదా అని ప్రయాణికుడు టెన్షన్ పడే పరిస్థితి. 8 దాటితే బస్సు లేనట్టే అనే అభిప్రాయానికి వచ్చేశారు చాలామంది పల్లె వాసులు. ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి ఇది. అంతా వాళ్లిష్టం. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఉద్యోగులే.
– రిక్వెస్ట్ స్టాప్ అన్నమాటే మరిచారు
ఒకప్పుడు పాసింజర్ ఫ్రెండ్లీగా ఉండేది ఆర్టీసీ. రిక్వెస్ట్ స్టాపులు ఉండేవి. ప్రయాణికుడి అభ్యర్థన మేరకు బస్సు ఆపేవారు. కానీ ఇప్పుడు రిక్వెస్ట్ చేసినా స్టాప్ లేదు. దూర ప్రాంతం నుంచి పల్లెలకు వచ్చేవారు ఎక్స్ ప్రెస్ ఎక్కి, చివరి స్టాపు వరకు ఫుల్ టిక్కెట్ తీసి, రిక్వెస్ట్ స్టాప్ కింద తమ పల్లెలో దిగాలనుకుంటారు.
ఇలా చేయడం వల్ల ఆర్టీసీకి ఎలాంటి నష్టం లేదు. పైపెచ్చు లాభం కూడా. కానీ ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయడం మానేసింది ఆర్టీసీ. అంతా వాళ్లిష్టం. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఉద్యోగులే.
– ఇప్పుడు ఆ మాటల్లేవ్.. అన్నీ డబ్బు లెక్కలే
ఒకప్పుడు ఆర్టీసీ ఉద్యోగులంతా కలిస్తే వాళ్ల మాటలు చాలా బాగుండేవి. సంస్థ కోసం, సంస్థ తరపున మాట్లాడేవారు. కండక్టర్లు కలిస్తే వాళ్ల లైన్లో ఆక్యుపెన్సీ, ఆ రోజు కలెక్షన్ గురించి మాట్లాడుకునే వారు. డ్రైవర్లు కలిస్తే బస్సు బాగోగులు, టైర్లలో గాలి, మెయింటెనెన్స్, ఆయిల్, గేర్ షిఫ్ట్, డీజిల్ పొదుపు, షిఫ్ట్ డ్యూటీల గురించి మాట్లాడుకునేవారు.
ఇప్పుడవన్నీ పోయాయి. అంతా అలవెన్సులు, జీతాలు, లీవులు గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. అంతా వాళ్లిష్టం. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఉద్యోగులే.
– మెయింటెనెన్స్ మరిచిన ఆర్టీసీ
పాత డొక్కు వాహనాల్ని కూడా ఒకప్పుడు ఎంతో అపురూపంగా చూసుకునేవారు. దాన్ని చక్కగా, జాగ్రత్తగా మెయింటైన్ చేసుకునేవారు. కొత్త బస్సులు డిపోకు వస్తే డ్రైవర్ కళ్లల్లో మెరుపు కనిపించేది. కానీ ఇప్పుడు ఆర్టీసీ మెయింటెనెన్స్ ఊసే మరిచింది. అంతా వాళ్లిష్టం. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఉద్యోగులే.
– పల్లె వెలుగు, కూరగాయల రవాణా ఎక్కడ
ఒకప్పుడు రైతులకు ఆర్టీసీ బాగా ఉపయోగపడేది. ఉదయాన్నే 5 గంటలకు పల్లె నుంచి పట్టణానికి బస్సు ఉండేది. తాము పండించిన కూరగాయల్ని అందులో వేసుకొని పట్నానికి వెళ్లేవారు. కేవలం వీళ్ల కోసమే వెనక సీట్లు తొలిగించి, కూరగాయలు పెట్టుకునేలా బస్సుల్ని మార్చారు. కానీ ఇప్పుడీ కల్చర్ రానురాను తగ్గిపోతోంది.
టైమ్ కు బస్సు రాదు, ఒకప్పటి సహకారమూ లేదు. దీంతో రైతులంతా ఆటోల్ని ఆశ్రయిస్తున్నారు. అంతా వాళ్లిష్టం. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఉద్యోగులే.
– కరోనా సాకు కానేకాదు
ఈమధ్య ఏ వాదన తెరపైకొచ్చినా కరోనా పేరు చెప్పి తప్పించుకోవడం కామన్ అయిపోయింది. ఆర్టీసీ వ్యవహారశైలి విషయంలో దీన్ని సాకుగా చూపించడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇలాంటి టైమ్ లో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మరింత బాధ్యతాయుతంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. కానీ అలాంటి ఛాయలు ఆర్టీసీలో కనిపించలేదు. అంతా వాళ్లిష్టం. ఎందుకంటే అంతా ప్రభుత్వ ఉద్యోగులే.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలివి. ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ పెద్దల వరకు ఈ విషయాలు రాకపోవచ్చు. వాళ్ల దృష్టిలో ఇవి చిన్న విషయాలు కావొచ్చు. కానీ సామాన్య ప్రేక్షకుడికి ఇవే చాలా పెద్ద విషయాలు. అతడ్ని అసౌకర్యానికి గురిచేసే విషయాలు. అన్ని డిపోల్లో పరిస్థితి ఇలానే ఉందని చెప్పలేం. కానీ పలాస నుంచి చిత్తూరు వరకు మేజర్ డిపోల్లో పరిస్థితి మాత్రం ఇదే.
ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసిన తర్వాత తమ రాబడి బాగుందని చిన్న పట్టణాల్లో ఆటోడ్రైవర్లు చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే జగన్ నిర్ణయం మంచిదే కావొచ్చు. వేల కుటుంబాలకు ఉద్యోగ భద్రత దక్కింది. కానీ దాన్ని అలుసుగా తీసుకొని ఆర్టీసీ వ్యవహరిస్తున్న తీరు మాత్రం సంస్థకు, ఇటు జగన్ సర్కార్ కు ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వంపై ప్రజల్లో అసహనానికి కారణమైన ప్రధాన అంశాల్లో ఇది కూడా ఒకటి.