హీరో విశ్వక్ సేన్ అతి డైలాగుల సంగతి తెలిసిందే. పాగల్ సినిమా హిట్టవ్వకపోతే తన పేరు మార్చుకుంటానన్నాడు ఈ హీరో. లాక్ డౌన్ తో మూతపడిన థియేటర్లన్నీ పాగల్ తో తెరుచుకుంటాయని, అలా తెరుచుకోకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరాడు ఈ హీరో. ఇప్పుడా సవాల్ నిజమౌతుందా? విశ్వక్ తన పేరు మార్చుకుంటాడా లేక అదే పేరును కొనసాగిస్తాడా? మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.
“ఆడియో ఫంక్షన్‌లో నేను మాట్లాడిన ఏ మాటను వెనక్కి తీసుకోవడం లేదు. కొన్ని గంటలు మాత్రమే మిగిలున్నాయి. నా స్నేహితులు, ఇతరులు సినిమా చూసి నువ్వు పేరేం మార్చుకోనక్కర్లేదన్నారు. సినిమా ప్రమోషన్స్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావ్.. సినిమా తొలి ఆట పూర్తి కాగానే, ప్రమోషన్స్ ఆపేయొచ్చు అని నా స్నేహితుడొకడన్నాడు.”
ఇలా అప్పటి తన స్టేట్ మెంట్ ను మరోసారి సమర్థించుకున్నాడు విశ్వక్. తను ఆ డైలాగ్స్ ను ఫ్లోలో అనలేదని, ప్రీ-రిలీజ్ కు వచ్చే ముందు సినిమా చూసిన తర్వాత ఆ డైలాగ్స్ తన నోటి నుంచి వచ్చాయంటున్నాడు.
“ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చే ముందు నా సినిమాను నేను ఓసారి చూసుకుంటాను. దాన్ని బేస్ చేసుకునే స్టేజ్‌పై మాట్లాడుతాను. ఏడాది, ఏడాదిన్నర పాటు కష్టపడి సినిమా చేశాం. అందరం కథలో ఎమోషన్‌ను నమ్మి సినిమా చేశాం. మాది పెద్ద సినిమా కాదు గొప్ప సినిమా. హృదయాలను కదిలిస్తుంది.”
ఇలా పాగల్ ను మరోసారి పొగిడేశాడు ఈ హీరో. ఈరోజు థియేటర్లలోకొచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.