ఇవాళ తిరుమల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన ఘట్టం. శనివారం రాత్రి ఏడు గంటలకు శ్రీవారి గరుడ వాహన సేవను టీటీడీ అధికారులు నిర్వహించనున్నారు. గరుడ సేవలో తరించేందుకు భక్తులు తిరుమలకు పోటెత్తనున్నారు. సుమారు 4.50 లక్షల మంది తిరుమల కొండకు చేరుకోవచ్చని అంచనా. భక్తులందరికీ గరుడ వాహన సేవలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఇందుకు భక్తులు సహకరించాలని ఆయన కోరారు. గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆయన తెలిపారు. సుమారు 5 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. మాఢవీధుల్లో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. గరుడ సేవలో హారతులను టీటీడీ రద్దు చేసింది.
కరోనా కారణంగా గత రెండేళ్లలో తిరుమలలో బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదు. రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న తర్వాత బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కావడంతో భక్తులు పాల్గొనేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. గరుడ సేవకు భక్తులు పోటెత్తుతుండడంతో రవాణా సౌకర్యాల్ని మెరుగుపరిచారు. ప్రతి నిమిషానికి రెండు బస్సులను కొండపైకి ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటికే భక్తులతో కొండంతా కిక్కిరిసింది.
ఇవాళ ద్విచక్ర వాహనాలను కొండపైకి అనుమతించరు. గరుడ సేవలో పాల్గొనేందుకు భక్తులు ఆ ముందు రోజుల్లో తిరుమలకు రాలేదు. దీంతో మూడునాలుగు రోజుల క్రితం కొండంతా ఖాళీగా కనిపించింది. నేరుగా దర్శన భాగ్యం కలిగిందని కొందరు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
శ్రీవారి గరుడ సేవలో పాల్గొనడం గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు. జీవితంలో కనీసం ఒక్కసారైనా గరుడ సేవలో పాల్గొనాలనే వాళ్లు కష్టనష్టాలను లెక్క చేయకుండా తిరుమలకు చేరుకుంటున్నారు.