రాజుగారి మరణం చుట్టూ ఎన్నికల రాజకీయాలు

సాధారణంగా మన దేశంలో ప్రతి విషయాన్నీ ఎన్నికల రాజకీయాలకు, ఓట్లు సంపాదించుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏవేవో అంశాలు గుర్తుకు వస్తాయి రాజకీయ నాయకులకు. సెలబ్రిటీల వెనుక ఉన్న సామాజిక వర్గాలు…

సాధారణంగా మన దేశంలో ప్రతి విషయాన్నీ ఎన్నికల రాజకీయాలకు, ఓట్లు సంపాదించుకోవడానికి వాడుకుంటూ ఉంటారు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఏవేవో అంశాలు గుర్తుకు వస్తాయి రాజకీయ నాయకులకు. సెలబ్రిటీల వెనుక ఉన్న సామాజిక వర్గాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా సెలబ్రిటీల మరణాలను సైతం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని ప్రయత్నిస్తారు. ఫలానా సెలబ్రిటీని తామే గౌరవించామని చెప్పుకోవడానికి ప్రతి రాజకీయ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. కొంత కాలంగా సీనియర్ నటుడు,హీరో కృష్ణంరాజు మరణం రాజకీయ పార్టీలకు కేంద్రబిందువుగా మారింది. ఏపీ రాజకీయాలు ఆయన మరణం చుట్టూ తిరుగుతున్నాయి. 

ఈ విషయంలో అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు జాతీయ పార్టీ అయిన బీజేపీ కూడా పోటీ పడుతోంది. కృష్ణంరాజు కేవలం సినిమా హీరో కాదు కదా. రాజకీయ (బీజేపీ) నాయకుడు. కేంద్ర మాజీ మంత్రి. భారీగా ఓట్లున్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కాబట్టి ఓట్ల రాజకీయాల్లో భాగంగానో లేదా గౌరవంతోనో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మృతివనం నిర్మిస్తామని ప్రకటించింది. అయితే ఎప్పుడూ  ఇటువంటి వాటికి ముందుకు రాని జగన్ సర్కారు ఉన్నపళంగా కృష్ణంరాజుపై ప్రేమ ఒలకబోయడానికి చాలా కారణాలున్నాయి.

రెబల్ స్టార్ కృష్ణంరాజుతో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆపై వీరు క్షత్రియ సామాజికవర్గానికి చెందిన వారు. అందుకే వారిని టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుందన్న కామెంట్స్  వినిపిస్తున్నాయి. గత ఎన్నికలకు ముందు క్షత్రియ సామాజికవర్గం వైసీపీకి మద్దతు తెలిపింది. మెజార్టీ వర్గాలు జగన్ కు అండగా నిలిచాయి. అందుకే ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు వైసీపీ తరపున  ఎమ్మెల్యేలు, ఎంపీలుగా గెలిచారు. కానీ గత మూడు సంవత్సరాలుగా జగన్ సర్కారు అనుసరించిన తీరుతో క్షత్రియ సామాజికవర్గం వైసీపీకి దూరమైంది. 

ఎన్నికలు జరిగిన ఆరు నెలలకే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆ పార్టీకి దూరమయ్యారు. అటు తరువాత ఆయనపై దాడి, పోలీసు కేసులు, సొంత నియోజకవర్గానికి రాకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు క్షత్రియ సామాజికవర్గంలో మార్పునకు కారణాలయ్యాయి. అటు విజయనగరంలో పూసపాటి రాజవంశీయుడు అశోక్ గజపతిరాజు పై కక్ష సాధింపునకు దిగడం కూడా క్షత్రియ సామాజికవర్గానికి రుచించ లేదు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు నుంచి అశోక్ గజపతిరాజును తప్పించడం, రామతీర్థం రామస్వామి దేవస్థానంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అశోక్ ను అవమానపరచడం.. ఇలా వరుస పరిణామ క్రమాలు క్షత్రియవర్గాన్ని వైసీపీకి దూరం చేశాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతుంటారు.

అయితే దూరమైన క్షత్రియ సామాజికవర్గాన్ని దగ్గర చేర్చుకునేందుకే కొత్తగా జగన్ సర్కారు కృష్ణంరాజు స్మృతివనం ఏర్పాటుకు ముందుకొచ్చిందని క్షత్రియ సామాజికవర్గం పెద్దలు కూడా భావిస్తున్నారు. మూడున్నరేళ్లుగా అణగదొక్కి.. ఇప్పుడు కూల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ అటు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టింది. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వెనుక రాజకీయ ప్రయోజనాలుంటాయని.. రాజులను దరి చేర్చుకునేందుకే ఈ నిర్ణయమంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగం కామెంట్స్ ను ట్రోల్ చేస్తోంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా దీటుగానే స్పందిస్తోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ కు భారీగా స్మృతివనం నిర్మించగా లేనిది కృష్ణంరాజుకు వద్దా అన్న స్లోగన్ బయటకు తీసింది.

ఎన్టీఆర్ కంటే కృష్ణంరాజు ఏం తక్కువ అని ప్రశ్నిస్తోంది. కృష్ణంరాజు ఇష్యూను రాజకీయ లబ్ధి పొందేందుకు అటు వైసీపీ, ఇటు టీడీపీ ఆరాటపడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక కృష్ణంరాజు మరణించాక ఆయన అంత్యక్రియలు చేసింది ప్రభాస్ అన్న ప్రబోధ్. అప్పుడే ఒక టాక్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రబోధ్ కు బీజేపీ తరపున టిక్కెట్ ఇస్తారని. అలా చేస్తే కృష్ణంరాజును గౌరవించినట్లు ఉంటుంది. ఆయన ఇమేజ్ ను, పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇమేజ్ ను ఉపయోగించుకోవచ్చు. ఇలా కృష్ణం రాజు మరణం చుట్టూ రాజకీయ వల అల్లాయి రాజకీయ పార్టీలు. ఎన్నికలనాటికి కృష్ణంరాజు మరణాన్ని ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.