ఎన్నికలకు భయపడిన నేతకు ఎమ్మెల్సీ పదవా?

పార్టీ కోసం కష్టపడే నాయకులంటే… పార్టీకి అండగా నిలిచే నాయకులు అంటే.. దాని అర్థం ఎన్నికల సమయంలో పార్టీ గెలవడానికి ఉపయోగపడేవాళ్లే. పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి తొడకొట్టి.. విజయం కోసం సమరం…

పార్టీ కోసం కష్టపడే నాయకులంటే… పార్టీకి అండగా నిలిచే నాయకులు అంటే.. దాని అర్థం ఎన్నికల సమయంలో పార్టీ గెలవడానికి ఉపయోగపడేవాళ్లే. పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి తొడకొట్టి.. విజయం కోసం సమరం సాగించేవాళ్లే. అయితే.. ధనబలం కోణంలోంచి బలహీనమైన నాయకుడు కాకపోయినప్పటికీ.. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోటీచేయడానికి జడిసి, భయపడి, వెనకాడిన నాయకుడికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి.. దొడ్డిదారిలో మంత్రివర్గంలోకి కూడా తీసుకునేందుకు తెలంగాణలో కేసీఆర్ సర్కారు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గుత్తా సుఖేందర్ రెడ్డి సీనియర్ నాయకుడు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యపార్టీల్లోనూ ఆయన కీలకనేతగా చెలామణీ అయ్యారు. తెలుగుదేశం మూలాలు ఉన్న గుత్తా, తర్వాత కాంగ్రెసులోకి, ఆ పిమ్మట తెరాసలోకి మారారు. 2014లో కాంగ్రెసు తరఫున నల్గొండ ఎంపీగా గెలిచిన ఆయన తెరాసలోకి ఫిరాయించారు. రాష్ట్రమంత్రిగా పనిచేయాలనేది గుత్తా కల. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయాలని ముచ్చటపడ్డారు. హుజూర్ నగర్ స్థానం నుంచి పీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద పోటీచేయాలని తెరాస ఆయనను కోరింది. తాను అడిగిన స్థానం ఇస్తే మాత్రమే ఎన్నికల్లో దిగుతానని గుత్తా అన్నట్లు వార్తలు వచ్చాయి.

హుజూర్ నగర్ లో ఉత్తమ్ ను దీటుగా ఎదుర్కొనేందుకు ధనబలం పరంగా గుత్తా అయితే పార్టీకి ఎడ్వాంటేజీ ఉంటుందని తెరాస తలపోసింది. కానీ పార్టీ పురమాయించిన తర్వాత.. తనంతగా తాను ఆ నియోజకవర్గంలో సర్వేలు కూడా చేయించుకున్న గుత్తా.. పోటీకి దిగడానికి వెనకాడారు. ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీచేయలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి నోటిఫికేషన్ వచ్చింది.

ఈ రూట్లో గుత్తాను ఎమ్మెల్సీగా శాసనసభలో అడుగు పెట్టించడానికి తెరాస హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ మార్గంలోనే మంత్రిపదవి కూడా కట్టబెడతారని సమాచారం. ఎన్నికల్లో పార్టీకోసం పనిచేసి, శ్రమించి వ్యయప్రయాసల కోర్చి విఫలమైఉన్నా కూడా అది వేరే తీరు. కానీ.. ఎన్నికల్లో దిగడానికే పోటీపడి జాగ్రత్త వహించిన నాయకుడికి ఇవాళ దొడ్డిదారిలో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?