ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే కోటాలోనే జరుగుతున్న ఎన్నికలు. మొత్తం 175 ఎమ్మెల్యేల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే 151 మంది సభ్యుల బలం ఉన్న నేపథ్యంలో.. మూడు స్థానాలనూ వారే గెలుచుకోవడం ఖరారు. ఆ నేపథ్యంలో అధికార పార్టీనుంచి లెక్కకు మిక్కిలిగా ఆశావహులు తమ తమ ప్రయత్నాలు చేసుకునే అవకాశం ఉంది. పేరుకు మూడు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి గానీ.. నిజానికి ఆశావహులు ప్రయత్నాలు చేసుకోవడానికి ఖాళీ మాత్రం ఒక్కటే ఉన్నదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానం కోసం విపరీతంగా నాయకులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అగ్రవర్ణాలు, ఎస్సీ వర్గాల నుంచి ఎక్కువ మంది నాయకులు ఈ ఒకేఒక్క ఖాళీ కోసం ఆశలు పెంచుకుంటున్నారు. ఇందుకు కారణాలు ఉన్నాయి. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ మంత్రివర్గంలో ఉన్నారు. ఆయనను ఎటుతిరిగీ ఆరునెలల్లోగా శాసనసభలో సభ్యుడిగా చేయాల్సిందే. ఆ క్రమంలో ఆయన బీసీ వర్గానికి చెందిన నాయకుడు. ఆ కోటాలోనే ఆయనకు మంత్రిపదవి కూడా లభించింది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న మూడు ఖాళీల్లో ఒకటి మోపిదేవికి కేటాయిస్తే ఇక బీసీలకు మరో అవకాశం దక్కకపోవచ్చు.
అలాగే.. జగన్మోహన రెడ్డి.. తను అధికారంలోకి వచ్చిన నాటినుంచి మైనారిటీలకు కూడా ప్రతి సందర్భంలోనూ తగిన ప్రాధాన్యం కల్పిస్తూనే వస్తున్నారు. ఇటీవల గుంటూరులో ఇఫ్తార్ విందు జరిగినప్పుడు ఇక్బాల్ అహ్మద్ ఖాన్ ను ఎమ్మెల్సీ చేస్తామంటూ జగన్ మాట ఇచ్చారు. ఆయన హిందూపురంలో గత ఎన్నికల్లో ఓడిపోయారు. మాజీ ఐజీ కూడా. మైనారిటీ వర్గం నుంచి ఇంకా పెద్దగా పోటీపడేవాళ్లు కూడా కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇక్బాల్ కు ఒక అవకాశం దక్కుతుంది.
ఉన్న మూడు ఖాళీల్లో రెండు భర్తీ అయిపోయినట్టే. ఇక మిగిలిందెల్లా ఒక్కటి మాత్రమే. బీసీ మైనారిటీ వర్గాలకు ఇచ్చేసినట్లే గనుక. ఎస్సీ, అగ్రవర్ణాలు మాత్రమే మిగిలాయి. రెడ్డి వర్గం నుంచి చాలామంది టికెట్ ఆశిస్తున్నారు. అలాగే ఎస్సీ వర్గం నుంచి కూడా ఆశావహులు ఉన్నారు. ఈ వర్గాల నుంచి.. చల్లా రామకృష్ణారెడ్డి, ఆకేపాటి అమరనాధ్ రెడ్డి, మర్రి రాజశేఖర్, మాజీ ఎంపీ రవీంద్రబాబు తదితరులు ఉన్నారు.
వైకాపా తరఫున తేలవలసింది ఒకే ఒక్క ఎమ్మెల్సీ అభ్యర్థి మాత్రమే అయినప్పటికీ.. జగన్ విదేశాల నుంచి తిరిగి వచ్చేదాకా అది తేలే అవకాశం లేదు. అప్పటిదాకా ఆ ఒక్క సీటు కోసం… ఆశావహులు పార్టీలో కీలకనేతల చుట్టూ తిరుగుతూ ఉండాల్సిందే.