ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందో అని పాడుకునేలా వుంది..మొగల్తూరులో దివంగత హీరో కృష్ణం రాజు సంస్మరణ సభ వ్యవహారం చూస్తుంటే. సహజంగానే వెస్ట్ గోదావరి క్షత్రియుల చేయి జోరుగా వుంటుంది. పెట్టుపోతలు ఓ రేంజ్ లో వుంటాయి. హీరో ప్రభాస్ కు కూడా ఇదే గుణం అబ్బింది.
అందుకే నిన్నటికి నిన్న మొగల్తూరులో సుమారు లక్ష మందికి భోజనాల ఏర్పాట్లు చేసాడు. ఆ భోజనాలు కూడా మామూలుగా కాదు. మెనూ ఒక రేంజ్ లో వుంది. డజను రకాల నాన్ వెజ్ లు, వెజ్ లు ఇలా నోరూరించే వంటకాలు, అవి కూడా ప్రతి ఒక్కరికీ అందేలా, విశాలమైన, విస్తృతమైన ఏర్పాట్లు.
దీనికి తోడు ఈ కార్యక్రమానికి విస్తృతమైన మీడియా కవరేజ్ వచ్చింది. సోషల్ మీడియా మొత్తం ఈ భోజనాల విశేషాలతో ఊగిపోయింది. అక్కడితో ఆగిపోతే బాగుండును. అలా ఆగలేదు. ఉరిమి ఉరిమి మెగాస్టార్ మీద పడింది. కృష్ణంరాజు స్వస్థలం మాత్రమే కాదు, మెగాస్టార్ నేటివ్ ప్లేస్ కూడా మొగల్తూరునే. అక్కడి నుంచి వచ్చి వేల కోట్లు ఆర్జించారు మెగాస్టార్. ఎప్పుడయినా పట్టుమని పది మందికి భోజనాలు పెట్టారా? ఫ్యామిలీని మొగల్తూరుకు తీసుకుచవ్చారా? ఇలా ఒక విధంగా కాదు, అనేకానేక విధాలుగా మెగాస్టార్ ను సోషల్ మీడియా టార్గెట్ చేసింది.
దీనికి మెగాభిమానులు కొంత వరకు బదులు ఇచ్చారు. ఒక్క రోజు అన్నదానం కాదు, చిరకాలంగా రక్తదానాలు, ఆక్సిజన్ సదుపాయాలు మెగాస్టార్ సమకూర్చుతున్నారంటూ. కాస్త బిరియానీ పెడితే అవన్నీ మిరచిపోతారా అంటూ. కానీ ఇవేవీ ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోల్ ముందు అస్సలు ఆగలేదు.
మొత్తం మీద ప్రభాస్ మొగల్తూరు భోజనాల వ్యవహారం సోషల్ మీడియాలో మెగాస్టార్ ను గాడ్ ఫాదర్ విడుదల ముందు గట్టిగా కార్నర్ చేసింది.