బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై సొంత పార్టీలోని కమ్మ నేతలు ధిక్కరణ స్వరం వినిపిస్తున్నారు. మరోవైపు సోము వీర్రాజుపై అసమర్థుడిగా ముద్రవేసి, ఆయన్ను పార్టీ నుంచి తప్పించేస్తున్నారనే ప్రచారం వెనుక బీజేపీలోని కమ్మ నేతల కుట్ర ఉందనే చర్చ ఆ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. మరోవైపు సోము వీర్రాజును నేడోరేపో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారని, ఆయన ఆదేశాలను, సూచనలను లెక్కలోకి తీసుకోవాల్సిన పనిలేదనే సంకేతాల్ని తమ చర్యల ద్వారా బీజేపీలోని కొందరు కమ్మ నేతలు పంపుతున్నారనే అభిప్రాయాలు లేకపోలేదు.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు ఆదేశాల్ని బహిరంగంగా ధిక్కరించే వారు కొందరైతే, మరికొందరు మాత్రం బయట పడకుండా ఆ పని చేస్తున్నారనే చర్చ బీజేపీలో సాగుతోంది. బీజేపీ రాష్ట్ర నాయకుడు విష్ణువర్ధన్‌రెడ్డిపై ఎల్లో చానల్లో దాడి నేపథ్యంలో, ఆ మీడియా సంస్థను బహిష్కరిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు బహిరంగ ప్రకటన చేశారు. ఇక మీదట ఆ చానల్ చర్చల్లో పాల్గొనేది లేదని, అలాగే ఆ పత్రికను తమ కార్యక్రమాల కవరేజీకి పిలిచేది లేదని సోము వీర్రాజు తెగేసి చెప్పారు. పిలవని పేరంటానికి వెళ్లేది లేదని సదరు చానల్, పత్రిక ఎండీ ఒక సందర్భంలో స్పష్టం చేశారు.
దీంతో సదరు పత్రిక, చానల్లో ఏపీ బీజేపీకి సంబంధించిన కార్యక్రమాల వార్తలేవీ రావడం లేదు. కానీ ఆ ముగ్గురు బీజేపీ నేతలు అందుకు మినహాయింపు కావడం గమనార్హం. బీజేపీ కమ్మ త్రయంగా పిలుచుకునే లంకా దినకర్, రమేశ్‌నాయుడు, పాతూరు నాగభూషణం చౌదరిలు మాత్రం తాము బీజేపీ అనే విషయాన్ని విస్మరించి, కులాభిమానాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు సొంత పార్టీలో ఉన్నాయి. ఈ ముగ్గురి ఎజెండా ఒక్కటే… అది జగన్ ప్రభుత్వాన్ని బద్నాం చేయడం, టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమనే చర్చ జరుగుతోంది. అందుకే వీళ్ల ముగ్గురికి సంబంధించిన వార్తలు మాత్రమే సదరు పత్రికలో వస్తుండడాన్ని బీజేపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
ఏపీ బీజేపీ బహిష్కరించిన సదరు ఎల్లో పత్రికలో ‘అనైతిక విధానాలతో ఆర్థిక కోమాలోకి’ శీర్షికతో లంకా దినకర్ ఓ వ్యాసం రాశారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే…లంకా దినకర్ తన పార్టీ హోదాను పొందుపరచలేదు. వ్యక్తిగతంగా పోకస్ కావడం విశేషం. ఇంతకూ దినకర్ తాను పార్టీలో ఉన్నట్టా? లేనట్టా? అనే ప్రశ్నలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన లంకా దినకర్… ఆ తర్వాత కాలంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో సస్పెండ్ చేశారు.
కొంత కాలానికి మళ్లీ సస్పెన్షన్ ఎత్తి వేశారు. కానీ టీడీపీపై ప్రేమను, వైసీపీపై ద్వేషాన్ని పోగొట్టుకోలేక పోతున్నారు. ఇదే సమయంలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఆశయాలు, ఆదేశాలకు దినకర్ తూట్లు పొడుస్తున్నారనేందుకు …నేడు ఎల్లో పత్రికలో ప్రచురితమైన వ్యాసమే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను మారిన మనిషిని కాదని మరోసారి బీజేపీకి ఆయన చెప్పకనే చెప్పారు. మరోవైపు టీడీపీ నుంచే వెళ్లిన పాతూరి నాగభూషణం చౌదరి, నాగోతు రమేశ్‌నాయుడు వ్యవహారాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్నారు.మొదటి నుంచి మనిషి కాషాయం, మనసు పసుపు అనేరీతిలో రమేశ్‌నాయుడి రాజకీయ నడవడిక ఉందని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలను ధిక్కరిస్తూ… ఎల్లో చానల్ డిబేట్లలో యాజమాన్యాన్ని అడిగి మరీ ఫోన్ ఇన్ కార్యక్రమాల్లో పార్టీని అడ్డు పెట్టుకుని టీడీపీకి ప్రయోజనం కలిగించేలా తమ అభిప్రాయాల్ని పాతూరి నాగభూషణం, రమేశ్ నాయుడు, లంకా దినకర్ వ్యక్తం చేస్తున్నారనే విమర్శలున్నాయి. కడప జిల్లాకు చెందిన రమేశ్‌నాయుడు మొదటి నుంచి ఏబీవీపీలో ఉంటున్నా …చంద్రబాబు అభిమానిగా గుర్తింపు పొందారు. అందుకే ఈయన వార్తలకు సదరు బీజేపీ బహిష్కరణ పత్రిక, చానల్లో ప్రాధాన్యం దక్కుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అది ఎంతగా అంటే …చివరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించి వీర్రాజు పేరు లేకుండానే, పాతూరు నాగభూషణం చౌదరి, రమేశ్‌నాయుడు, లంకా దినకర్ చౌదరి పేర్లు వచ్చేంతగా. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలనేది ఈ కమ్మనేతల ఆరాటం, పోరాటం. ప్రధాన ప్రత్యర్థి వైసీపీని దెబ్బకొట్టేందుకు బీజేపీ అనే రక్షణ కవచనం వీరికి కావాలి. తమ లక్ష్యం నెరవేరే వరకూ కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనే ఆయుధాన్ని చేతిలో పెట్టుకోవాలనే వ్యూహం… ఆ పార్టీ కమ్మ నేతల్లో కనిపిస్తోంది.
బీజేపీ కమ్మత్రయం ధిక్కరణ కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా ….ఏపీ నాయకత్వం ఉదాసీనంగా ఎందుకు వ్యవహరిస్తున్నదో ఎవరికీ అంతుచిక్కడం లేదు. తమది క్రమశిక్షణకు పెట్టింది పేరని బీజేపీలోని గల్లీస్థాయి నుంచి ఢిల్లీస్థాయి వరకూ గొప్పలు చెబుతుం టారు. మరి ఒక పార్టీ అధ్యక్షుడు బహిరంగంగా ఇచ్చిన బహిష్కరణ పిలుపునే పాటించని నేతలు ప్రత్యర్థి పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
బీజేపీ కమ్మత్రయం ప్రచారం చేస్తున్నట్టు ఇది సోము వీర్రాజు అసమర్థత అంటే తప్పేంటి? నిజంగా తమ పార్టీ క్రమశిక్షణకు మారుపేరైతే… రాష్ట్ర అధ్యక్షుడిగా తానిచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్న వారిపై చర్యలు తీసుకుని, బీజేపీలోని మిగిలిన అలాంటి వారికి ఓ హెచ్చరిక పంపేలా చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ శ్రేణులే డిమాండ్ చేస్తుండడం గమనార్హం. ఆ దిశగా ఆలోచించే దమ్ము, ధైర్యం కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుకు ఉన్నాయా?