నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీబీఐ మరోసారి షాక్ ఇచ్చింది. జగన్ కేసులో రెండో నిందితుడైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.
రఘురామ పిటిషన్‌పై సీబీఐ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. బెయిల్ రద్దు నిర్ణయాన్ని కోర్టుకే వదిలేస్తున్నట్టు సీబీఐ తన అభిప్రాయాన్ని విచారణలో భాగంగా న్యాయస్థానానికి విన్నవించింది.
ఇదే రీతిలో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై కూడా సీబీఐ చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేయడం, దానిపై విచారణ తదితర పరిణామాలన్నీ తెలిసినవే. అప్పట్లో షాక్‌కు గురైన రఘురామ సీబీఐపై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో జగన్, విజయసాయిరెడ్డిలపై కేసు నమోదు చేసిన సీబీఐ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకుంది. ఎందుకంటే సీబీఐ నిర్ణయాన్నే అంతిమంగా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. కేసు నమోదు చేసిన సీబీఐకి లేని అభ్యంతరం, బాధ రఘు రామకృష్ణంరాజుకు ఏంటో అనే విమర్శలు కొన్నిరోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
రఘురామను వెనుక నుంచి ఆడిస్తున్న పెద్దలెవరో ఇటీవల సుప్రీంకోర్టులో సీఐడీ సమర్పించిన అఫిడవిట్ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని తాజాగా సీబీఐ కోర్టులో సీబీఐ మెమో దాఖలు చేయడం సంచలనం రేకెత్తిస్తోంది.