ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభంపై క్లారిటీ వచ్చేసింది. ఈనెల 16 నుంచి స్కూల్స్ తిరిగి మొదలు పెడతారా లేదా అంటూ ఇప్పటివరకూ కాస్త కన్ఫ్యూజన్ ఉంది. శ్రీకాకుళంకి చెందిన ఓ ఉపాధ్యాయుడు కోర్టు మెట్లెక్కారు.
ఈ కేసు విచారణలో ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ని కోర్టు పరిగణలోకి తీసుకోవడంతో స్కూల్స్ పునఃప్రారంభంపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. కేసు విచారణ ఈనెల 18కి వాయిదా పడటంతో 16 నుంచి స్కూల్స్ తెరుచుకుంటాయనే విషయం ఖాయమైపోయింది.
జగన్ రిస్క్ చేస్తున్నారా..?
కోర్టు కూడా పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీలో స్కూల్స్ తిరిగి మొదలు కావడానికి అడ్డంకులు లేకుండా పోయాయి. అయితే ఉపాధ్యాయుల వ్యాక్సినేషన్ విషయంలో అంతా సవ్యంగా జరుగుతోందా అనేది అనుమానంగా మిగిలింది. ఈనెల 16లోపు ఏపీలోని ఉపాధ్యాయులందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. మరి ఆ లక్ష్యం ఎంతవరకు నెరవేరింది..?
ఏపీలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లకు సంబంధించి మొత్తం టీచర్లు 2,83,303 మంది ఉన్నారు. వీరిలో కేవలం 79,205మందికి మాత్రమే రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. 69,618మందికి కనీసం ఒక్క డోసు కూడా ఇవ్వలేదు. మిగతా వారికి కేవలం ఒక డోస్ మాత్రమే దక్కింది. కోర్టుకి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో ఈ విషయాలన్నీ ఉన్నాయి.
అఫిడవిట్ లోని నెంబర్లు చూస్తే.. ఏపీలో పూర్తి స్థాయిలో టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తయిందని చెప్పలేం. మరి జగన్ ఎందుకు రిస్క్ చేస్తున్నట్టు. ఓవైపు ముందుగానే స్కూల్స్ తెరిచిన పంజాబ్ లో విద్యార్థులకు కరోనా సోకింది. అటు బెంగళూరులో కూడా పరిస్థితి అలాగే ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలన్నీ సెప్టెంబర్ తర్వాత స్కూల్స్ అంటున్నాయి. 15 రోజుల ముందుగానే పాఠశాలలు తెరిచి జగన్ రిస్క్ చేస్తున్నారేమో అనిపిస్తుంది.
గతంలోకూడా టెన్త్, ఇంటర్ పరీక్షల విషయంలో చివరివరకూ సాగదీసి ఆపై పరీక్షలు పెట్టడం లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలన్నీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాయి. 16వ తేదీ లోగా స్కూల్స్ వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వమే ప్రకటిస్తుందని జోకులు పేల్చుతున్నారు. రాగా పోగా ప్రభుత్వ టీచర్లే హడావిడి పడుతున్నారు.
రెండు డోసుల వ్యాక్సిన్ కూడా కొవిడ్ ని విజయవంతంగా అడ్డుకుంటుందన్న భరోసా లేని ఈ క్లిష్ట పరిస్థితుల్లో.. కనీసం ఒక్క డోసు కూడా వ్యాక్సిన్ వేసుకోని టీచర్లతో పిల్లలకు పాఠాలంటే ఎలా కుదురుతుంది?
అటు తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. వారి సంగతేంటి..? జగన్ రిస్క్ చేస్తున్నారా..? లేక ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా మారుతారా..? అనేది మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.