విశాఖపై విష ప్రచారం: నిపుణులు ఏం చెబుతున్నారు?

ఎప్పుడైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అమరావతిని కాదని విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారో అప్పట్నుంచి ఆ ప్రాంతంపై టీడీపీ నేతలు, బాబు అనుకూల మీడియా కక్షకట్టింది. విశాఖను బ్యాడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకసారేమో…

ఎప్పుడైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, అమరావతిని కాదని విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించారో అప్పట్నుంచి ఆ ప్రాంతంపై టీడీపీ నేతలు, బాబు అనుకూల మీడియా కక్షకట్టింది. విశాఖను బ్యాడ్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకసారేమో ఉగ్రవాదుల దాడి అన్నారు. మరోసారి భూకంపం/సునామీ అన్నారు, ఇంకోసారి రసాయన ఫ్యాక్టరీ నుంచి విషవాయులు వచ్చి ప్రాణాలు తీసేస్తుందన్నారు. ఇప్పుడేమో ఏకంగా విశాఖ మునిగిపోతుందని చెబుతున్నారు.

రీసెంట్ గా ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (ఐపీసీసీ) ఇచ్చిన నివేదికను చూపెడుతూ.. విశాఖ ప్రజల్ని భయపెట్టడంతో పాటు.. జగన్ సర్కారును ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఐపీసీసీ నివేదిక కరెక్టే కావొచ్చు. వందేళ్లలో విశాఖ నగరంలోకి సముద్రుడు చొచ్చుకు వచ్చే ప్రమాదం ఉండొచ్చు. మరి ఈ వందేళ్లలో నష్ట నివారణ చర్యలు చేపట్టరా? గ్లోబర్ వార్మింగ్ ను అరికట్టరా..? ప్రత్యామ్నాయ మార్గాలు చూడరా? విశాఖ సంగతి పక్కనపెడితే.. చెన్నై, ముంబై నగరాలకు కూడా ముప్పు ఉందని ఐపీసీసీ రిపోర్ట్ చెబుతోంది కదా. మరి మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై నుంచి రాజధానిని తరలిస్తుందా. తమిళనాడు సర్కారు చెన్నైని వదిలిపెట్టి రాష్ట్రం మధ్యలోకి రాజధానిని మారుస్తుందా..? మరి విశాఖపైనే ఎందుకింత దుష్ప్రచారం జరుగుతోంది.

తన వ్యాపార కార్యకలాపాలన్నిటికీ ఒకప్పుడు విశాఖనే కేంద్రంగా చేసుకున్నారు ఈనాడు అధినేత రామోజీరావు. ఇప్పుడు అదే పత్రికలో విశాఖపై దుష్ప్రచారం కొనసాగుతోంది. ఐపీసీసీ ప్రకటించిన 12 భారత నగరాలు పూర్తిగా నీట మునగవు, కేవలం అక్కడ సముద్రమట్టాలు పెరుగుతాయి. ఆ ప్రభావం నగరంపై కూడా పడుతుందని మాత్రమే ఐపీసీసీ ప్రకటించింది. అందులోనూ 12 నగరాల ఆ జాబితాలో విశాఖ స్థానం 11. అంటే మిగతా 10 నగరాల కంటే విశాఖ సేఫ్ జోన్ లోనే ఉంది.

ఇవన్నీ పక్కనపెడితే.. స్వయంగా భూగర్భ శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులే ఐపీసీసీ నివేదికను తప్పు పడుతున్నారు. కేవలం సముద్ర మట్టం నుంచి ఎంత ఎత్తులో నగరం ఉందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నివేదిక ఇచ్చారని.. విశాఖ నగర ఆకృతి, భౌగోళిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకోలేదని చెబుతున్నారు.

విశాఖలో చాలా ప్రాంతాలు ఎత్తులో ఉన్నాయి. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి గాజువాక వరకు ఎన్నో ప్రాంతాలు చిన్నచిన్న గుట్టలపై ఏర్పడ్డాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ నైసర్గిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నివేదిక ఇచ్చారని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ.. రాబోయే వందేళ్లలో గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించలేకపోయినా, ఎలాంటి నష్ట నివారణ చర్యలు తీసుకోలేకపోయినప్పటికీ.. కేవలం ఆర్కే బీచ్ ప్రాంతం వరకు మాత్రమే మునిగే ప్రమాదం ఉందని బల్లగుద్ది చెబుతున్నారు.

ఓవైపు నిపుణులు ఇలా స్పష్టంగా విశాఖ భద్రతపై ప్రకటన చేస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా మాత్రం విశాఖ అంతమైపోతోందనే కోణంలో తప్పుడు ప్రచారం చేస్తోంది.

కేవలం గ్లోబల్ వార్మింగ్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, పరిస్థితి మరీ చేయిదాటితే వచ్చే పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పేందుకే ఐపీసీసీ వంటి సంస్థలు ఇలాంటి నివేదికలు బయటపెడుతుంటాయి. మరి ఈ నివేదికల్ని పట్టుకుని విశాఖ రాజధాని వ్యవహారాన్ని పలుచన చేయాలనుకోవడం ఎంతవరకు సబబు. ప్రజలే ప్రతిపక్షాల కుట్రల్ని అర్థం చేసుకోవాలి, దీనిపై ఆలోచించాలి.