రావ‌య్యా జ‌గ‌న్‌…గోడు విన‌వ‌య్యా!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు తండ్రి దివంగ‌త వైఎస్సార్ బాట‌ను ఎంచుకున్నారు. పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయ‌న నేరుగా వారితో క‌లిసేందుకు ‘రచ్చబండ’ పేరుతో రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌కు…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అయ్యేందుకు తండ్రి దివంగ‌త వైఎస్సార్ బాట‌ను ఎంచుకున్నారు. పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయ‌న నేరుగా వారితో క‌లిసేందుకు ‘రచ్చబండ’ పేరుతో రాష్ట్ర వ్యాప్త ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్టేందుకు నిర్ణ‌యించుకున్నారు. ఈ మేర‌కు త‌న తండ్రి వైఎస్సార్ జ‌యంతి సెప్టెంబ‌ర్ 2 లేదా గాంధీ జ‌యంతి అక్టోబ‌ర్ 2 నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

'నేను విన్నాను.. నేను ఉన్నాను' …ప్ర‌జాప్ర‌స్థానంలో వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే చెప్పిన మాట‌. ఒక్క చాన్స్ ఫ్లీజ్ అని జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి చేస్తే… దానికి ఏపీ ప్ర‌జానీకం సానుకూలంగా స్పందించింది. క‌నీవినీ ఎరుగని రీతిలో వైసీపీకి సీట్ల‌ను క‌ట్ట‌బెట్టి, జ‌గ‌న్‌ను అధికార పీఠంపై కూచోపెట్టారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది.

ఈ రెండేళ్ల‌లో వైఎస్ జ‌గ‌న్ పాల‌నపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కొంచెం తీపి, కొంచెం చేదు, మ‌రికొంచెం వ‌గ‌రు అన్న చందంగా జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తున్న మాట‌. సంక్షేమ ప‌థ‌కాలు మాత్రం ప‌క్కాగా అమ‌ల‌వుతున్నాయి. అయితే నిజమైన‌ అర్హుల్లో కొంద‌రికి ప‌థ‌కాలు అంద‌డం లేదు. అలాంటి వాళ్లు స‌చివాల‌యాల‌కు వెళ్లి త‌మ అర్హ‌త‌కు సంబంధించి ప‌త్రాలు స‌మ‌ర్పిస్తే… వారంలో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని జ‌గ‌న్ ప‌దేప‌దే చెబుతుంటారు.

నిజానికి క్షేత్ర‌స్థాయిలో అలా జ‌ర‌గ‌డం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు పింఛ‌న్ రాలేద‌ని ఎవ‌రైనా స‌చివాల‌యానికి వెళ్లి అర్హ‌త ప‌త్రాలు స‌మర్పిస్తే …దానిపై నిర్ణ‌యం తీసుకునేందుకు నెల‌ల స‌మ‌యం ప‌డుతోంది. త‌మ చేతుల్లో ఏమీ లేద‌ని, అంతా రాజ‌ధానిలో నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని జిల్లా అధికారుల నుంచి వ‌స్తున్న స‌మాధానం. అలాగే రైతులు అడంగ‌ల్ క‌రెక్ష‌న్ చేసుకోవాలంటే నెల‌లు, సంవ‌త్స‌రాలు ప‌డుతోంది. 

రైతుల‌కు కొత్త పాసు పుస్త‌కాలు రావాలంటే అంతా దైవాదీనం అన్న‌ట్టుగా త‌యారైంది. ఇసుక అంద‌ని ద్రాక్షే అయ్యింది. ఇలా అనేక స‌మ‌స్య‌ల‌తో జ‌నం అల్లాడిపోతున్నారు. ఒక్క సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు త‌ప్ప‌, మిగిలిన ఏ ఒక్క విష‌యంలోనూ ప్ర‌జ‌లు సంతృప్తిగా లేరు. ఒక్కొక్క‌రిదీ ఒక్కో స‌మ‌స్య‌. 

గ‌త పాల‌కులే మేలు అన్న అభిప్రాయాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. 30 ఏళ్ల పాటు అధికారంలోకి ఉండాల‌ని క‌ల‌లు కంటున్న జ‌గ‌న్‌కు ఇది ప్ర‌మాద హెచ్చ‌రిక‌. జ‌నంలో సంతృప్తిని అసంతృప్తి డ్యామినేట్ చేస్తోంది. దీనికి గ‌ల కార‌ణాల‌ను జ‌గ‌న్ నేరుగా తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే లోటుపాట్ల‌ను స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ‘రచ్చబండ’ ఇస్తుంది.

అయితే ఫ్లీప్లాన్డ్ ‘రచ్చబండ’ కాకుండా, ప్ర‌తి ఒక్క‌రూ పాల్గొని త‌మ ఆవేద‌న‌ను వెల్ల‌డించే అవ‌కాశం క‌లిగిస్తే సీఎంకు నిజాలు తెలిసొచ్చే అవ‌కాశం ఉంటుంది. అలా కాకుండా పొగ‌డ్త‌ల‌కు ప‌రిమితం చేస్తే మాత్రం …జ‌గ‌న్‌కు న‌ష్టమే త‌ప్ప లాభం ఉండ‌దు. కానీ త‌మ గోడు వినిపించేందుకు జ‌గ‌న్ కోసం జ‌నం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నార‌న్న‌ది నిజం.