ఏపీ ప్రభుత్వానికి స్త్రీ, శిశుసంక్షేమ శాఖ అప్రతిష్ట తెచ్చింది. స్త్రీ, శిశుసంక్షేమశాఖలో గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీలో మంత్రి కార్యాలయ కేంద్రంగా ఉన్నతాధికారులు భారీ అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 560 మంది విస్తరణ అధికారుల నియామకంలో పారదర్శకత పాటించలేదని, ఉన్నతాధికారులు ముందే పోస్టులు అమ్ముకున్నారని బహిరంగంగా విమర్శలు చేశారు.
ఇది కాస్త హైకోర్టుకు చేరింది. గ్రేడ్-2 పోస్టుల భర్తీలో అవకతవకలపై బుధవారం వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఒక్కో పోస్టును రూ.10 లక్షలకు అమ్ముకున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని న్యాయస్థానానికి వివరించారు. కనీసం మెరిట్ లిస్ట్‌ను ప్రకటించకుండా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ పెట్టడంపై వెనుక లోపభూయిష్టాన్ని కోర్టుకు వివరించారు.
వాదనలు విన్న హైకోర్టు నియామకాలపై స్టే విధించి ప్రభుత్వ కళ్లు తెరిపించింది. ఆరు వారాల్లో స్టే వెకేషన్ తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా వుండగా ఈ నెల 18న పరీక్షలు నిర్వహించి, 25న కొందరి పేర్లను ఇంటర్వ్యూలకు ఎంపిక చేసింది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిదీ పారదర్శకంగా జరగాలని కోరుకుంటారని, మరి ఈ పోస్టుల విషయంలో మంత్రి ఉషశ్రీ చరణ్ బాధ్యత వహిస్తున్న స్త్రీ, శిశుసంక్షేమశాఖలో మాత్రం ఎందుకు తిలోదకాలు ఇచ్చారనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
ఈ పోస్టుల భర్తీ వెనుక పెద్ద ఎత్తున చేతులు మారినట్టు ఆరోపణలు గుప్పుమన్నాయి. వాస్తవాలు రాసిన, చెప్పిన జర్నలిస్టులపై సదరుశాఖ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతా పారదర్శకంగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే సదరు శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష సమావేశం జరిపారు. ఈ పోస్టులను నెలాఖరు లోపు ఎట్టి పరిస్థితుల్లో పారదర్శకంగా భర్తీ చేయాలని ఆదేశించడం గమనార్హం. ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్ సీరియస్ అవుతారని అందరూ భావించారు.
జగన్ చర్యలు తీసుకుంటారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మెరిట్ లిస్ట్ ప్రకటించకుండా పోస్టులు భర్తీ చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. అవినీతి ఆరోపణలకు బలం కలిగించేలా స్త్రీ, శిశుసంక్షేమ శాఖ అధికారుల తీరు వుందనే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో గ్రేడ్-2 పోస్టుల భర్తీపై స్టే విధించి, అక్రమార్కులకు దిమ్మతిరిగేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.