Advertisement

Advertisement


Home > Politics - National

అశోక్ గహ్లోత్ : రెంటికీ చెడిన చందం అవుతుందా?

అశోక్ గహ్లోత్ : రెంటికీ చెడిన చందం అవుతుందా?

నిన్నటి దాకా ఆయన కాంగ్రెస్ పార్టీలో సోనియా కుటుంబానికి వీరవిధేయ భక్తగణంలో ఒకరు. తమ కుటుంబం కాకుండా, బయటి వ్యక్తిచేతిలో పార్టీ పగ్గాలు పెట్టాలని సంకల్పించినప్పుడు.. సోనియా ఎంచుకున్న మొదటి వ్యక్తి గహ్లోత్! పార్టీ సారథ్యాన్నే ఆయన చేతిలో పెట్టేద్దామని అనుకున్న సోనియా, ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే దాపురించింది. 

కేవలం అత్యాశ, పార్టీ ఆలోచనను కాదని.. తన వర్గబలాన్ని చూపించుకోవాలనే ఉబలాటం.. అన్ని పదవులూ తన కనుసన్నల్లోనే ఉండాలనే దుగ్ధ ఇవన్నీ కలిసి గహ్లోత్ కు ఈ స్థితి కల్పించాయి. రెండో రోజు మేడం అపాయింట్మెంట్ దొరికింది గానీ.. అనేకానేక క్షమాపణలు చెల్లించుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఆయన అభ్యర్థిత్వం హుష్ కాకి అయిపోయింది. మేడం తరఫు గుర్రంగా దిగ్విజయ్ సింగ్ రింగులోకి దిగుతున్నారు. అయితే ఇప్పుడు ట్రాజెడీ ఏంటంటే.. సదరు రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవి అయినా.. ఆయన చెంతనే ఉంటుందా? లేదా, ఈ తిరుగుబాటు పుణ్యమాని మేడం దాన్ని కూడా ఊడగొట్టి.. ఆయనను ఇంట్లో కూర్చోబెడుతుందా? అనేది!

అశోక్ గహ్లోత్ చాలా కాలం కిందటే.. తన పోకడలతో పార్టీలో చీలిక అనివార్యం అనే పరిస్థితిని కల్పించారు. సచిన్ పైలట్ తన వర్గం ఎమ్మెల్యేలతో వేరుకుంపటి పెట్టుకోదలచిన వేళ.. ఆయనను బుజ్జగించి కాంగ్రెసులోనే ఉండేలా చేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం చాలా తంటాలు పడవలసి వచ్చింది. అప్పటినుంచి సచిన్ పైలట్ ఉపముఖ్యమంత్రిగా నెట్టుకొస్తున్నారు. 

తాజా పరిణామాలలో గహ్లోత్ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్లిపోతే.. సదరు సీఎం సీటు తనకు దక్కుతుందని పైలట్ అంచనా వేయడంలో తప్పులేదు. అయితే అదే అంచనాకు గహ్లోత్ వర్గం కూడా వచ్చి.. అలా జరగకుండా చూడాలని కుట్రపన్నడం వల్లనే గొడవంతా వచ్చింది. నేను రెండు కాదు మూడు పదవులనైనా ఏకకాలంలో సమర్థంగా నిర్వహించగలను అంటూ ఈ 72 ఏళ్ల వృద్ధుడు చాలా డాంబికంగా చెప్పుకొచ్చారు. 

మొత్తానికి అధ్యక్షుడు అయినా సరే.. సీఎం సీటు వదిలేది లేదని తేల్చేశారు. కానీ.. రాహుల్ అక్షింతలు వేసేసరికి ఆయన జోడు పదవుల ముచ్చట వదిలిపోయింది. కానీ.. తన వర్గాన్ని ఎగేశారు. గహ్లోత్ వర్గం వారికే సీఎం సీటు అప్పగించకపోతే రాజీనామా అంటూ వారు బెదిరించారు. ఈ తిరుగుబాటును అధిష్ఠానం సీరియస్ గా తీసుకుంది. మొత్తానికి ఇలాంటి కుట్ర ఆలోచనలుండే గహ్లోత్ కు పార్టీ సారథ్యం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. 

అయితే ఈ తిరుగుబాటు వలన.. ఆయన మీద సోనియా కన్నెర్ర అయ్యారనేది నిజం. అందుచేత.. రాజస్తాన్ ముఖ్యమంత్రిగా కూడా తప్పిస్తారా? తప్పిస్తే అక్కడ ముఠా కుమ్ములాటలు తథ్యంగా బయటపడతాయి. ఆ చికాకులు ప్రస్తుతం ఎందుకు లెమ్మనుకుని.. ఆయనను క్షమించి సీఎం సీటులో వదిలేస్తారా? అనేది వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?