గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగుల తొలగింపుపై జగన్ సర్కార్ న్యాయ పోరాటం వృథా అయింది. గ్రామ పంచాయతీ కార్యాలయాకు అధికార పార్టీ రంగులు వేయడంపై కొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం విచారించి గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని ఆదేశించింది.
అయితే న్యాయస్థాన ఆదేశాలను గౌరవించినట్టు భావించి అదనంగా ఎర్రమట్టి రంగును జోడించి నూతన జీవోను జారీ చేసింది. దీనిపై కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రంగులను తొలగించాల్సిందేనని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టుకు రెండోసారి వెళ్లగా తాజాగా రంగులు తొలగించాలని ఆదేశించింది. దీంతో ఏపీ సర్కార్కు దేశ అత్యున్నత న్యాయ స్థానంలో చుక్కెదురైనట్టైంది. నాలుగు వారాల్లోగా రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది.
గ్రామ పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులు వేయడంపై సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వస్తున్నప్పటికీ ఖాతరు చేయలేదు. మొండి పట్టుదలకు, పంతాలకు పోయి న్యాయస్థానాల్లో ఏపీ సర్కార్ అభాసుపాలైంది. రంగులు తొలగించాలని తమతో పాటు సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ, పట్టించుకోకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ కింద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పంచాయతీశాఖ ముఖ్య కార్యదర్శి, మరో ఉన్నతస్థాయి అధికారిపై హైకోర్టు కేసు నమోదు చేసింది. అంతేకాదు సాక్ష్యాత్తు రాష్ట్ర అత్యున్నత స్థాయి అధికారులు హైకోర్టుకు హాజరై క్షమాపణ వేడుకోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ రంగుల తొలగింపుపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, అక్కడ మళ్లీ భంగపాటుకు గురి కావడం కోరి తెచ్చుకున్నవిగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు ఆదేశాలను పాటించకపోవడం ఏపీ సర్కార్ తప్పిదంగా సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. ఇప్పటికైనా దేశ అత్యున్నత న్యాయస్థాన ఆదేశాలను పాటించి గత కొన్ని నెలలుగా నడుస్తున్న రంగుల సీరియల్కు ఫుల్స్టాప్ పెడతారని ఆశిద్దాం.