వచ్చే ఎన్నికల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా ఒక అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. అదే అభ్యర్థుల మార్పు! వీలైనన్ని నియోజకవర్గాల్లో .. సిట్టింగుల స్థానాల్లో వేరే వాళ్లను నిలపడానికి ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నారని స్పష్టం అవుతూ ఉంది. దీనికి బోలెడన్ని కారణాలున్నాయి.
ఎమ్మెల్యేలుగా చాలా మంది పనితీరు మీద జగన్ తను తెప్పించుకున్న రిపోర్టులను, వారి వ్యవహారాలపై తనకు ఉన్న స్పష్టతను బట్టి అభ్యర్థుల మార్పు అంశంపై తీవ్రంగా ఆలోచిస్తూ, అందుకు సంబంధించి కసరత్తును ఇప్పటికే మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.
ఇందులో ముఖ్యంగా ప్రత్యామ్నాయాలు, సాధ్యాసాధ్యాల గురించి జగన్ సమాలోచనలు సాగుతున్నట్టుగా భోగట్టా. వీరి స్థానంలో వారెలా ఉంటారు, వారి స్థానంలో వీరైతే ఎలా ఉంటారు.. అనే ఆలోచనలు, అందుకు సంబంధించి అంతర్మథనాలకు కూడా జగన్ ఛాన్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది.
తెప్పించుకున్న రిపోర్టులు, కొత్తగా స్ఫురించే ఆలోచనలతో.. అభ్యర్థుల మార్పు అంశంపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత అయితే రానట్టుగా ఉంది. చాలా చోట్ల అభ్యర్థులను మార్చాలనేది మాత్రం జగన్ ఇప్పటికే తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. పలు నియోజకవర్గాల విషయంలో ఇప్పటికే కఠినమైన నిర్ణయాలు కూడా జగన్ వద్ద జరిగినట్టుగా సమాచారం. మరి కొన్ని చోట్ల విషయంలో ఇంకా సాధ్యాసాధ్యాల పరిశీలనలు సాగుతున్నాయని సమాచారం.
సాధారణంగా మరోసారి తాము గెలుస్తామని గట్టిగా వాదించే పార్టీ ఏదైనా సిట్టింగులను పక్కన పెట్టదు. ఫీల్ గుడ్ .. అంటూ అదే బ్యాచ్ తో మరోసారి ఎన్నికలకు దిగుతూ ఉంటుంది. అయితే వచ్చే సారి కూడా అధికారం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం సిట్టింగుల మార్పుతోనే ఎన్నికలను ఎదుర్కొనడం తథ్యంగా కనిపిస్తోంది.