కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష ఎన్నిక ఆ పార్టీలో కొత్త కుదుపులకు దారి తీస్తోంది. కొత్త అధ్యక్ష ఎన్నిక నూతనోత్సాహాన్ని ఇవ్వడం మాట అటుంచి… కొత్త రచ్చలకు దారి తీస్తోంది. ఇలాంటి వ్యవహారాలు కాంగ్రెస్ కు కొత్త కాదు. ప్రత్యేకించి 2014 తర్వాత పార్టీలో ఇలాంటివి కొత్త కొత్తవి తెరపైకి రాకపోతే వింత అన్నట్టుగా ఉంది వ్యవహారం. ఇలాంటి క్రమంలో గాంధీకుటుంబేతర నేతను పార్టీ జాతీయాధ్యక్ష పదవికి ఎన్నుకునే ముచ్చట ఉంటుందన్న తరుణంలో కూడా అధ్యక్ష ఎన్నిక రచ్చగానే మారింది.
అశోక్ గెహ్లాట్ ను సోనియా ఎంపిక చేసుకుందని, ఆయనకు పార్టీ జాతీయ అధ్యక్ష పీఠాన్ని ఇచ్చి మళ్లీ వెనుక నుంచి తనే కంట్రోల్ చేసేందుకు ఆమె నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇంతలో తను ఉన్నానంటూ శశిథరూర్ రెడీ అయ్యారు. సోనియా ఆశీస్సులు కోరారు. అయితే ఎవరైనా పోటీ చేసుకోవచ్చంటూ సోనియాగాంధీ అసహనాన్ని వ్యక్తం చేసినట్టుగా వార్తలు వచ్చాయి. గెహ్లాట్ ను సోనియా అనుకోవడంతోనే థరూర్ పై అసహనం అనే అభిప్రాయాలు వినిపించాయి.
అయితే ఇప్పుడు అశోక్ గెహ్లాట్ తను పోటీలో ఉండనంటూ ప్రకటించేశారు. రేపే అధ్యక్ష ఎన్నిక నామినేషన్ కు చివరి రోజు కాగా.. ఇప్పుడు ఆయన తప్పుకున్న ప్రకటన చేశారు. మరోవైపు రాజస్తాన్ కాంగ్రెస్ లో సంక్షోభం తెరమీదకు వచ్చింది. ఈ పరిణామాల్లో అక్కడి ప్రభుత్వం ఉంటుందా, కూలుతుందా? అనేది శేషప్రశ్న.
ఇదిలా ఉంటే.. మరో వైపు దిగ్విజయ్ సింగ్ రెడీ అయిపోయారు. ఆయన కూడా నామినేషన్ పత్రాలను తీసుకున్నారట. రేపు ఆయన నామినేషన్ వేయబోతున్నారట. మరి కాంగ్రెస్ ను పతానవస్థకు తీసుకెళ్లిన గొప్ప గొప్ప ఘనుల్లో దిగ్విజయ్ కూడా ముందు వరసలో ఉంటారు. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించిన వారిలో ఆయనకూ కీర్తి కిరీటం దక్కుతుంది. వ్యక్తిగతంగా కూడా దిగ్విజయ్ నాయకత్వ పటిమ ఎప్పుడో పతనమైంది.
మరి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ పడతారట! మరి సోనియా ఆశీస్సులు ఆయనకే ఉంటాయో ఏమో! మరి దిగ్విజయ్ ను ఎన్నుకునే మాత్రానికి అయితే.. కాంగ్రెస్ కు ఈ అధ్యక్ష ఎన్నికల ఖర్చుకూడా దండగేనేమో!