కరోనా గుప్పిట్లో హైదరాబాద్

ఎల్బీ నగర్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, మెహదీపట్నం, మలక్ పేట్, నాచారం, కాప్రా, ఉప్పల్, షేక్ పేట్, కోఠి.. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ నలువైపులా కరోనా వ్యాపించి ఉంది. ఏ ప్రాంతాన్ని సేఫ్…

ఎల్బీ నగర్, హిమాయత్ నగర్, ముషీరాబాద్, మెహదీపట్నం, మలక్ పేట్, నాచారం, కాప్రా, ఉప్పల్, షేక్ పేట్, కోఠి.. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ నలువైపులా కరోనా వ్యాపించి ఉంది. ఏ ప్రాంతాన్ని సేఫ్ అని చెప్పలేని విధంగా తయారైంది పరిస్థితి. కరోనా కేసుల విషయంలో తెలంగాణ అంతా ఒకెత్తయితే.. గ్రేటర్ హైదరాబాద్ ఒక్కటి మరో ఎత్తు. నగరంలో కరోనాను కట్టడిచేయడం ఇప్పుడు ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది.

గతంలో 10, 20, 25 స్థాయిలో కేసులు వస్తే ప్రజలతో పాటు ప్రభుత్వం కూడా కాస్త నిబ్బరంగా ఉంది. కరోనాను నియంత్రించామనే అనుకుంది. ఎప్పుడైతే దశలవారీగా మినహాయింపులు ఇవ్వడం మొదలుపెట్టారో అప్పుడే అసలు సమస్య మొదలైంది. నిన్న 70, మొన్న 79, అంతకు ముందు రోజు 122.. ఇలా గ్రేటర్ లో కరోనా కేసుల సంఖ్య ప్రజల్ని భయపెడుతోంది.

లాక్ డౌన్ వరకు పరిస్థితి కొంచెం అదుపులోనే ఉండేది. రాకపోకల్ని ప్రజలు బాగా తగ్గించగలిగారు. ఎప్పుడైతే మినహాయింపులిచ్చారో. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణాలు మొదలయ్యాయి. ఫలితంగా అప్పటివరకు కరోనా రహితంగా ఉన్న ప్రాంతాల్లో కూడా కొత్త కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. అలా నగరంలో దాదాపు 70శాతం ప్రాంతాన్ని కమ్మేసింది కరోనా.

కరోనా వస్తే ఒకటి, రెండు కేసులకు పరిమితం కావడం లేదు. సమూహాలకు సమూహాలు కేసులు నమోదవుతున్నాయి. ఒకే ఇంట్లో వ్యక్తులందరికీ, ఒకే అపార్ట్ మెంట్ లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్న దాఖలాలున్నాయి. అంతెందుకు.. నిన్నటికి నిన్న ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ లో 12 మందికి కరోనా సోకింది. ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ లో కరోనా కథలు-వ్యథలు కోకొల్లలు.

మరో 5 రోజుల్లో భారీ స్థాయిలో ఆంక్షల సడలింపులు రాబోతున్నాయి. రెస్టారెంట్లు, మాల్స్ కూడా ప్రారంభం అవుతాయి. ప్రభుత్వం జాగ్రత్తలు మాత్రమే చెబుతుంది. అవసరమైతే కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటుచేస్తుంది. కరోనా వస్తే చికిత్స అందిస్తుంది. కానీ అది రాకుండా జాగ్రత్త పడాల్సింది మాత్రం ప్రజలే. ఆంక్షలు ఎత్తేశారని అనవసర కార్యక్రమాలు, సరదాలు-షికార్లు పెట్టుకుంటే వైరస్ సోకే ప్రమాదం మూడింతలు ఎక్కువ. ఈ విషయంలో ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమం. 

ఆ విషయంపైనే అమిత్ షా ని కలుస్తున్నాం