నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ పై తెగే వరకూ లాగింది తెలుగుదేశం పార్టీ. ఈ వ్యవహారంలో కోర్టుకు ఎక్కడం, తాగి ఇష్టానుసారం వాగిన సుధాకర్ ను ఒక హీరోలా చిత్రీకరించడానికి చేసిన కుటిల ప్రయత్నం కథ అడ్డం తిరిగినట్టుగా ఉంది. ఈ డాక్టర్ వ్యవహారంపై హై కోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. మే 16వ తేదీన సుధాకర్ అనే ఆ డాక్టర్ అనుచితమైన ప్రవర్తనతో వార్తల్లోకి వచ్చాడు. ఆయనను పోలీసులు బంధించిన తీరు పై తెలుగుదేశం పార్టీ ఆక్షేపించింది. ఆయనను బంధించిన తీరుపై కోర్టుకు వెళ్లారు. అందుకు సంబంధించి వీడియోలు ఏవో సమర్పించారట.
అయితే సుధాకర్ ను బంధించడానికి ముందు తీసిన వీడియోలను కావాలని పక్కన పెట్టేసి, ఆయనను బంధించడం మాత్రం అమానవీయం అనే కలరింగ్ ఇవ్వాలని టీడీపీ వర్గాలు భావించాయి. ఏదేమైనా ఆ వ్యవహారంలో సీబీఐ విచారణకు ఆదేశించడం జగన్ ప్రభుత్వానికి సెట్ బ్యాక్ అని కొంతమంది ప్రచారం చేశారు. ఎలాగైతేనేం సీబీఐ విచారణ మొదలైంది. సుధాకర్ వ్యవహారానికి సంబంధించి మొత్తం వీడియోలను వీక్షించినట్టుగా ఉన్నారు సీబీఐ అధికారులు.
అంతిమంగా వారు తేల్చింది ఏమిటంటే.. సుధాకర్ పై న్యూసెన్స్ కేసు పెట్టాలనేది. ఐపీసీ సెక్షన్స్ 188, 357ల ప్రకారం సుధాకర్ పై న్యూసెన్స్ కేసునమోదు చేసింది సీబీఐ. సుధాకర్ వ్యహారాన్ని సీబీఐకి అప్పగించడంతో జగన్ ప్రభుత్వానికి ఏవో మరకలు పడిపోతాయని ఆశించిన వారికి భంగపాటు తప్పినట్టుగా లేదు.
జాతీయ రహదారి పక్కగా వెళ్లున్న కొంతమందిని, ఒక ఆటో డ్రైవర్ ను దుర్భాషలు ఆడటం, కులం మతం పేరిట అక్కడి వారిని, ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, కొన్ని మతాల వారిని దూషించడం, అడ్డుకోబోయిన కానిస్టేబుల్ నుంచి సెల్ గుంజుకుని నేలకేసి పగలగొట్టడం, అర్దనగ్నంగా రోడ్డుకు అడ్డంగా పడుకుని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడం, తనకు కరోనా ఉందని బెదిరించడం.. ఈ నేరాల కింద ఆయనపై న్యూసెన్స్ కేసును బుక్ చేశారట సీబీఐ అధికారులు. ఆ సమయంలో సుధాకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా కూడా అధికారులు ధ్రువీకరిస్తున్నారు.
సుధాకర్ అంత తీవ్రంగా ప్రవర్తించడం వల్లనే ఆయనను బంధించాల్సి వచ్చిందని ఏపీ పోలీసులు చెబుతున్నారు. ఇప్పుడు సీబీఐ కేసు ద్వారా వారికీ ఊరట లభించినట్టే. మరి సుధాకర్ పై తెగ సానుభూతిని వర్షింపజేస్తూ ట్వీట్టేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయడు, ఇంకా టీడీపీ, జనసేన వర్గాల వీరు ఇప్పుడు తామొక తాగి న్యూసెన్స్ చేసిన వ్యక్తిని సమర్థించినట్టుగా ఒప్పుకుంటారా?