'ఏదైనా కన్ స్ట్రక్టివ్ గా చెప్పలేనప్పుడు తమరు నోరు మూసుకోవడం మంచిది..' అంటూ అమెరిన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు సూచించారు అమెరికన్ పోలిస్ అధికారి ఒకరు. నల్ల జాతీయులుపై దాడులు అంటూ ఆఫ్రికన్-అమెరికన్లు అమెరికాలో రోడ్డెక్కిన సంగతి తెలిసిందే. ఒక నల్లజాతీయుడితో ఒక పోలీసాధికారి అత్యంత కర్కశంగా వ్యవహరించడం, అక్కడి పోలీసులకు ఇలాంటివి ఏమీ కొత్త కాకపోవడంతో నల్లజాతీయులు మరోసారి నిరసన బాట పట్టారు. అయితే ఈ నిరసనలు వేరేదారి పట్టాయి. ఆందోళన కారుల ముసుగులో కొందరు షాపులను లూటీ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనల అణిచివేత మొదలుపెట్టారు.
అయితే ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన రీతిలో ట్వీట్ చేశాడు. లూటీలు మొదలు కాగానే వారిపై కాల్పులు కూడా మొదలు కావాలి.. అంటూ ఒక ఉచిత సలహా పడేశాడు. లూటీకి పాల్పడే వారిని కాల్చి చంపాలని అమెరికా అధ్యక్షుడే ఇలా పోలీసులకు సూచించాడు. అయితే ఫెడరల్ గవర్నమెంట్ లో ట్రంప్ సలహా పట్ల గవర్నర్లు విస్తుపోతున్నారు. కాల్చి చంపేయడమే సమస్యకు పరిష్కారమార్గం అన్నట్టుగా ట్రంప్ స్పందించిన తీరు ఆయన మనస్తత్వాన్ని మరోసారి స్పష్టం చేస్తోందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలాంటి తరుణంలో హూస్టన్ పోలిస్ చీఫ్ తీవ్రంగా స్పందించారు. ఒక మీడియా వర్గంలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడి సలహాని ఉద్దేశించి తను స్పందిస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఏదైనా నిర్మాణాత్మక సలహా ఇస్తే ఇవ్వండి, లేకపోతే తమరు నోరు మూసుకోండి అని ఆ తెల్ల పోలిసాఫీసరే తేల్చి చెప్పాడు. అమెరికా అధ్యక్షుడు ఎంత అర్భక సలహాలు ఇస్తున్నాడో కానీ, అక్కడి పోలీసు ఉన్నతాధికారికే ఒళ్లు మండినట్టుగా ఉంది.