ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీకి సంబంధించి వారసులపై చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ వారసులపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జగన్ ఏమన్నారంటే…గడపగడపకూ కార్యక్రమంలో కొంత మంది ఎమ్మెల్యేలు తమ వారసులను తిప్పుతున్నారన్నారు. అయితే అలాంటివి ఒప్పుకునేది లేదని తెగేసి చెప్పారు. వారసుల్ని ప్రమోట్ చేసుకోవడాన్ని అభ్యంతరం చెప్పనన్నారు. ఈ సారికి మీరే పోటీ చేయాలని ఎమ్మెల్యేలకు జగన్ స్పష్టం చేశారు.
జగన్ అభిప్రాయాలపై బొత్స ఇవాళ స్పందించారు. వారసులు అందరికీ వుంటారన్నారు. తనకూ అబ్బాయి ఉన్నాడని చెప్పుకొచ్చారు. అయితే తన వారసుడు వైద్య రంగం వైపు వెళ్లాడని తెలిపారు. వారసుల్ని ఎవరైనా రాజకీయ రంగంలో దింపొచ్చన్నారు. కానీ ప్రజలు ఆమోదిస్తేనే నాయకులుగా రాణిస్తారని బొత్స తెలిపారు. బొత్స మాటల ప్రకారం ఆయన కుమారుడు రాజకీయాల్లోకి రారని అర్థం చేసుకోవాలి.
ఇదిలా వుండగా నిన్నటి దిశానిర్దేశంపై బొత్స తనవైన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కు అన్ని స్థానాల్లో గెలవాలని అనుకోవడం అత్యాశ కాదన్నారు. ఒక్కస్థానం పోయినా ఫర్వాలేదని అనుకుంటే, అది కాస్త 10 స్థానాలు అవుతాయని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ అంతిమ లక్ష్యం గెలుపే అని ఆయన స్పష్టం చేశారు. అదే విషయాన్ని తమకు జగన్ చెప్పారన్నారు.