విశాఖ నుంచే వికేంద్రీకరణ మొదలు

ఏపీ రాజకీయాల్లో వికేంద్రీకరణ అంశం ఇపుడు వేడి వాడి టాపిక్ గా ఉంది అన్నది తెలిసిందే. అమరావతి రాజధానిని వికేంద్రీకరించి విశాఖకు కొంత, కర్నూల్ కి మరికొంత భాగం ఇవ్వాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం…

ఏపీ రాజకీయాల్లో వికేంద్రీకరణ అంశం ఇపుడు వేడి వాడి టాపిక్ గా ఉంది అన్నది తెలిసిందే. అమరావతి రాజధానిని వికేంద్రీకరించి విశాఖకు కొంత, కర్నూల్ కి మరికొంత భాగం ఇవ్వాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది.

ఇక కర్నూల్ కి హై కోర్టు తరలించాలన్నది డిమాండ్ గా ఉండనే ఉంది. అయితే రాజధాని వికేంద్రీకరణ సంగతేమో కానీ విశాఖలో ఉన్న సీబీఐ కోర్టు మాత్రం మూడుగా విభజించబడింది. సీబీఐ ప్రధాన కోర్టు విశాఖలో ఉండగా రెండు అదనపు కోర్టులను విభజించారు.

అందులో రెండవ అదనపు సీబీఐ కోర్టుని కర్నూల్ లోనూ, మూడవ అదనపు సీబీఐ కోర్టుని విజయవాడకు తరలించాలని నిర్ణయించారు. ఈ మేరకు హై కోర్టు రిజిస్ట్రార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ అయినట్లుగా చెబుతున్నారు. తక్షణం సీబీఐ కోర్టుల తరలింపు మీద చర్యలు తీసుకోవలాని విశాఖ, కర్నూల్, విజయవాడ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులను కోరినట్లుగా సమాచారం.

ఇదిలా ఉండగా కర్నూల్ కి హైకోర్టు రావడం ఆలస్యం అయినా సీబీఐ కోర్టు ముందుగానే రావడం పట్ల అక్కడ జనాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక వికేంద్రీకరణకు విశాఖ నుంచే ముందడుగు పడింది. రానున్న రోజుల్లో ఇది ఎంత మేరకు వెళ్తుందో ఏపీలో మూడు ప్రాంతాలకు అనుకున్న విధంగా ఏ తీరున సమ‌న్యాయం జరుగుతుందో చూడాలి.