నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు నెమ్మదిగా మళ్లీ మునుపటిలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యక్తిగత విషయాలపై మాట్లాడుతున్నారు. తమ అధినేత అంటూనే మాటలకు వెటకారాన్ని దట్టిస్తున్నారు.
రఘురామకృష్ణంరాజు కామెంట్స్ వైసీపీకి ఖేదం, ఆ పార్టీ ప్రత్యర్థులకు మోదం కలిగిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రతిరోజూ ఏదో ఒక అంశంపై మాట్లాడుతూ జగన్ ప్రభుత్వానికి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.
తాజాగా జగన్ ఆస్తుల పంపకాలపై రఘురామ నోరు తెరిచారు. జగన్ ఆస్తిలో షర్మిలకు వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. దీనికి ఆయన లాజిక్ తీస్తున్నారు. అదేంటంటే….ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రావడానికి జగన్ చెల్లి షర్మిలారెడ్డి పాత్ర కూడా క్రియాశీలకమన్నారు.
వైసీపీకి మద్దతుగా షర్మిల విస్తృతంగా ప్రచారం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణలో షర్మిల సొంత కుంపటి పెట్టుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆస్తుల్లో సగభాగం షర్మిలకు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేయడం విశేషం.
తమ పార్టీ వైసీపీ విజయంలో సగ భాగం పాత్ర వహించిన షర్మిలకు ఆస్తిలో కూడా సగ భాగం ఇవ్వాల్సిందేనని రఘురామ డిమాండ్ చేయడం చర్చనీయాంశమైంది.