ప్రాంతీయ పార్టీలను బ్లాక్‌మెయిల్ చేసి పబ్బం గడుపు కోవడం బీజేపీకి బాగా అలవాటైంది. తమ వల్లే టీడీపీ ఘోర పరాజయం పాలైందని బీజేపీ నమ్ముతోంది. ఈ విషయాన్ని పదేపదే ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తుంటారు. ఇది నిజమేనని కాసేపు అనుకుందాం. ఈ క్రమంలో తాము రాజకీయంగా పొందిన లబ్ధి ఏంటో బీజేపీ నేతలు చెప్పలేకున్నారు. ఎందుకంటే బీజేపీకి పుట్టగతులు లేకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో టీడీపీ మాదిరిగానే తమతో పెట్టుకుంటే వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వైసీపీ కార్యకర్తల చేతిలో గాయపడ్డ బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు సోము వీర్రాజు గురువారం కడప జిల్లా ప్రొద్దుటూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వైసీపీకి టీడీపీ గతే పడుతుందని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ దాడులను ఆయన ఖండించారు. ప్రజాసమస్యలపై బీజేపీ ఉద్యమ బాట పట్టిందన్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలకు తమ వల్లే పడిపోయిందని బీజేపీ అధ్యక్షుడి హెచ్చరిక సారాంశం.
ఇదే రీతిలో రానున్న రోజుల్లో వైసీపీ కూడా దారుణ ఓటమిని మూటకట్టుకుందని సోము వీర్రాజు హెచ్చరించారు. ఈ క్రమంలో తాము ఎలా బలపడుతామో సోము వీర్రాజు వివరించలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీకి కాంగ్రెస్ కంటే అధ్వానంగా ఓట్లు వచ్చాయనే వాస్తవం గుర్తున్నట్టు లేదు.
టీడీపీ లేదంటే వైసీపీ అధికారంలోకి వస్తే …ఇక బీజేపీ ఎప్పుడు? ఎలా వస్తుందో కనీసం ఆ పార్టీ నేతలు ఒక్కసారైనా ఆలో చిస్తున్న దాఖలాలు లేవు. ఎంతసేపూ కొన్ని వ్యవస్థల్ని అడ్డుపెట్టుకుని, ప్రాంతీయ పార్టీల్ని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవాలనే బీజేపీ కుట్రపూరిత ఆలోచనలు… ఆ పార్టీని ఏపీలో బలోపేతం సంగతేమో గానీ మరింత బలహీనపరుస్తాయని చెప్పక తప్పదు. అందుకే తమ గతేంటో చెప్పండి సోము వీర్రాజూ సారూ! అంటూ నెటిజన్లు సెటైర్లు విసరడం!