మ‌రోసారి ఆమె స్కెచ్‌….‘భూ(మ‌)మ్‌’రాంగ్ !

టీడీపీ మ‌హిళా నేత ఆమె. నిండా మునిగిన త‌ర్వాత ఇక చ‌లేంటి? అనుకున్న‌ట్టున్నారు. సొంత పార్టీకి చెందిన నేత‌పై ఆమె, ఆమె భ‌ర్త క‌లిసి హ‌త్యాయత్నానికి స్కెచ్ వేశారు. పోలీసుల చాక‌చ‌క్యంతో హ‌త్యాయ‌త్నం విఫ‌ల‌మైంది.…

టీడీపీ మ‌హిళా నేత ఆమె. నిండా మునిగిన త‌ర్వాత ఇక చ‌లేంటి? అనుకున్న‌ట్టున్నారు. సొంత పార్టీకి చెందిన నేత‌పై ఆమె, ఆమె భ‌ర్త క‌లిసి హ‌త్యాయత్నానికి స్కెచ్ వేశారు. పోలీసుల చాక‌చ‌క్యంతో హ‌త్యాయ‌త్నం విఫ‌ల‌మైంది. అయితే జ‌గ‌న్ ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డంతో కీల‌క‌మైన ఆ కేసులో వారికి ఏమీ కాలేదు. దీంతో ఏం చేసినా… త‌మ‌కు ఏం కాద‌నే భ‌రోసా ఏపీ ప్ర‌భుత్వం పుణ్య‌మా అని వారిలో ధైర్యం నింపింది..

ఈ నేప‌థ్యంలో ఇవే ఛీప్‌ట్రిక్స్‌ని తెలంగాణ‌లో ప్ర‌యోగించారు. కిడ్నాప్‌న‌కు పాల్ప‌డి జైలుపాల‌య్యారు. నెల‌క్రితం న‌కిలీ కోవిడ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించిన కేసులో మ‌రోసారి తెలంగాణ పోలీసుల‌కు స‌ద‌రు టీడీపీ మ‌హిళా నేత భ‌ర్త‌, త‌మ్ముడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారు. ప్ర‌స్తుతం పోలీసుల అరెస్ట్ నుంచి త‌ప్పించుకునేందుకు… ఎక్క‌డో త‌ల‌దాచుకున్నారు. మ‌రోవైపు మ‌హిళా నేత త‌న ఇంట్లో ఆస్తులు, విలువైన డాక్యుమెంట్ల చోరీకి పాల్ప‌డ్డార‌ని తెలంగాణ పోలీసుల‌పై రివ‌ర్స్ కేసు పెట్టింది. ఈ సంఘ‌ట‌న‌ల గురించి చెబితే చాలు… ఆమె ఎవ‌రో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు పొందే స్థాయికి దిగ‌జారారు.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి స‌ద‌రు మ‌హిళా నేత‌, ఆమె భ‌ర్త అడ్డంగా దొరికార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇంత‌కూ అస‌లు విష‌యం ఏంటంటే….రంగారెడ్డి జిల్లా శంక‌రంప‌ల్లె మండ‌లం ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన మంద‌ముల‌ ల‌క్షుమ‌య్యపై క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌లో కేసు న‌మోదైంది. ఈ కేసులో ఆయ‌న అప్రూవ‌ర్‌గా మారాడు. ఆయ‌న వాంగ్మూలాన్ని వీఆర్వోల స‌మ‌క్షంలో పోలీసులు రికార్డు చేశారు. ఆ వాంగ్మూలంలోని వివ‌రాలివీ.

‘నా పేరు మంద‌ముల ల‌క్షుమ‌య్య (40). వ్యాపారం చేస్తూ బ‌తుకుతున్నాను. నేను చ‌దువుకోలేదు. రాయ‌లేను. కేవ‌లం సంత‌కం మాత్ర‌మే చేస్తాను. నాకు గుంటూరు శ్రీ‌నుతో ప‌రిచ‌యం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ గుంటూరు శ్రీ‌ను న‌న్ను ఆళ్ల‌గ‌డ్డ లాయ‌ర్ శివ‌ప్ర‌సాద్ వ‌ద్ద‌కు పిలిపించాడు. గుంటూరు శ్రీ‌ను, లాయ‌ర్ శివ‌ప్రసాద్ క‌లిసి కొన్ని టైప్ చేసిన పేప‌ర్లు, అలాగే తెల్ల  పేప‌ర్ల‌పై  నాతో ఆరు నుంచి ఏడు సంత‌కాలు చేయించుకున్నారు.

నేను ఎందుకు అని అడిగాను. త‌న ఆస్తుల‌కు నా పేరుపై బినామీగా పెడుతున్న‌ట్టు గుంటూరు శ్రీ‌ను చెప్పాడు. చ‌దువుకోలేదు కాబ‌ట్టి  ఇంగ్లీష్‌, తెలుగు చ‌ద‌వ‌లేను రాయ‌లేను. సంత‌కాలు అయిన త‌ర్వాత గుంటూరు శ్రీ‌నుకు చెందిన‌ న‌ల్ల‌టి కారులో ఇద్ద‌రం క‌లిసి హైద‌రాబాద్ వెళ్లాం. ఆళ్ల‌గ‌డ్డ ప‌ట్ట‌ణ పోలీస్‌స్టేష‌న్‌లో నాపై ఫోర్జ‌రీ సంత‌కాలు చేసిన నేరంపై కేసు న‌మోదైందని తెలిసింది. ఈ విష‌య‌మై గుంటూరు శ్రీ‌నును అడిగాను. 

ఆళ్ల‌గ‌డ్డ‌కు చెందిన భూమా శివ‌ల‌క్షుమ్మ నా పేరు పైన విక్ర‌య ఖ‌రారు డాక్యుమెంట్‌ రాయించిన‌ట్టుగా, అందుకు నేను ఆళ్ల‌గ‌డ్డ జూనియ‌ర్ సివిల్ జ‌డ్జి కోర్టులో దావా దాఖ‌లు చేసిన‌ట్టు చెప్పాడు. నా సంత‌కాల‌ను దావా దాఖ‌లు చేసేందుకు ఉప‌యోగించిన‌ట్టుగా చెప్పాడు. నేను ఆళ్ల‌గ‌డ్డ సివిల్ జ‌డ్జి కోర్టులో ఎలాంటి దావా దాఖ‌లు చేయ‌లేదు.

నా సంత‌కం తీసుకున్న గుంటూరు శ్రీ‌ను, లాయ‌ర్ శివ‌ప్రసాద్ త‌యారు చేశారు. ఆళ్ల‌గ‌డ్డ‌కు చెందిన భూమా శివ‌ల‌క్షుమ్మ‌ను నేను ఎప్పుడూ చూడ‌లేదు. భూమా శివ‌ల‌క్షుమ్మ సంత‌కాన్ని కూడా స‌ద‌రు అగ్రిమెంట్‌లో ఫోర్జ‌రీ చేశార‌ని తెలిసింది. నా సంత కాన్ని దావా దాఖ‌లు చేయ‌డానికి, అలాగే నా పేరుపై ఫోర్జ‌రీ అగ్రిమెంట్ త‌యారు చేయ‌డానికి గుంటూరు శ్రీ‌ను, లాయ‌ర్ శివ‌ప్ర‌సాద్ కార‌ణం’ అని పోలీసుల‌కు వాంగ్మూలం ఇచ్చాడు.

ఇత‌ని వాంగ్మూలంలో పేర్కొన్న గుంటూరు శ్రీ‌ను గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ఈయ‌న స‌ద‌రు మ‌హిళా నేత భ‌ర్తకు అత్యంత స‌న్నిహితుడు. టీడీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం కేసులో ఇత‌ను ప్ర‌ధాన నిందితుడు. అలాగే హైద‌రాబాద్ కిడ్నాప్ కేసులో కూడా ఇత‌ని పాత్ర కీల‌కం. ఇక లాయ‌ర్ శివ‌ప్ర‌సాద్ గురించి ఆళ్ల‌గ‌డ్డ‌లో ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌నిలేదు. ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ లీగ‌ల్ సెల్ అడ్వైజ‌ర్‌. వీళ్లద్ద‌రిపై ల‌క్షుమ‌య్య ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు గుప్పించాడు.

భూమా శివ‌ల‌క్షుమ్మ‌… ఈమె దివంగ‌త భూమా నాగిరెడ్డి అన్న భాస్క‌ర్‌రెడ్డి భార్య‌. ఈమెకు ఆళ్ల‌గ‌డ్డ‌లో 3.50 ఎక‌రాల భూమి ఉంది. ఈ భూమిని త‌న‌కు శివ‌ల‌క్షుమ్మ విక్ర‌యించిన‌ట్టు ల‌క్షుమ‌య్య పేరుతో న‌కిలీ డాక్యుమెంట్ల‌ను సృష్టించారు. దీనంత‌టికి గుంటూరు శ్రీ‌ను, లాయ‌ర్ శివ‌ప్ర‌సాద్ కార‌ణ‌మ‌ని తెలంగాణ వాసి ల‌క్షుమ‌య్య పోలీసుల‌కు ఇచ్చిన వాంగ్మూలంలో వివ‌రించాడు. భూమా శివ‌ల‌క్షుమ్మ కుమారుడు భూమా కిషోర్‌కుమార్‌రెడ్డి ప్ర‌స్తుతం ఆళ్ల‌గ‌డ్డ బీజేపీ ఇన్‌చార్జ్‌, రాజ‌కీయంగా చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. భూమా వార‌సుడిగా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలో అత‌నికి క్ర‌మంగా ఆద‌ర‌ణ పెరుగుతోంద‌నే అభిప్రాయాలున్నాయి.

రాజ‌కీయంగా భూమా కిషోర్‌రెడ్డి బ‌లోపేతం కావ‌డాన్ని జీర్ణించుకోలేని వాళ్లే, వాళ్ల త‌ల్లిపై ఉన్న భూమిని వివాదంలోకి లాగార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ల‌క్షుమ‌య్య వాంగ్మూలం మేర‌కు ఆళ్ల‌గ‌డ్డ పోలీసులు లోతుగా ద‌ర్యాప్తు చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌య్యారు. గుంటూరు శ్రీ‌ను, లాయ‌ర్ శివ‌ప్ర‌సాద్ వెనకున్న అదృశ్య‌ సూత్ర‌ధారులెవ‌రో తేల్చే ప‌నిలో ఆళ్ల‌గ‌డ్డ పోలీసులున్నారు. కానీ ఈ వ్య‌వ‌హారంతో భూమా కుటుంబ విభేదాలు పోలీస్‌స్టేష‌న్‌కు చేరే అవ‌కాశం లేక‌పోలేదు.

ఇదిలా ఉండ‌గా  భూమా కుటుంబంలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న నేప‌థ్యంలో, న‌కిలీ డాక్యుమెంట్ల సృష్టిక‌ర్త‌లెవ‌రో అనే ప్ర‌శ్న‌కు …అన్ని వేళ్లు ఆ మ‌హిళా నేత దంపతుల‌పై చూప‌డం గ‌మ‌నార్హం. భార్యాభ‌ర్త‌లు భూమి విష‌యంలో వేసిన స్కెచ్ ‘భూ(మ‌)మ్‌’రాంగ్ అయ్యింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. చూద్దాం ఈ కేసును చివ‌రికి పోలీసులు ఏ విధంగా తేల్చుతారో. టీడీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం కేసులా వీగిపోతుందా లేక ఉచ్చు బిగుస్తుందా? అనేది ఆళ్ల‌గ‌డ్డ పోలీసుల చిత్త‌శుద్ధిపై ఆధార ప‌డి ఉంది.