వలసల్ని ప్రోత్సహించడం, వలస నాయకులను ఆదరించడం, వారిని అందలం ఎక్కించడం అన్ని పార్టీలు చేసే పనే. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వారికి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది, ఇస్తారు కూడా. అదే సమయంలో సొంత పార్టీ నేతల్ని కూరలో కరివేపాకులా పక్కనపడేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో అలాంటి పరిణామాలే వరుసగా జరుగుతున్నాయి. పక్క పార్టీ నుంచి వచ్చినవారికి ఎర్రతివాచీ పరుస్తున్నారు కేసీఆర్. సొంత పార్టీలో నమ్మకంగా ఉన్నవారిని మాత్రం త్యాగాలతో సర్దుకుపోవాలని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ టీఆర్ఎస్ లో తిరుగుబాటు మొదలైంది.
“వాడెవడో కౌశిక్ రెడ్డి, పార్టీ కండువా కప్పేసి ఎమ్మెల్సీ ఇచ్చేస్తున్నారంటూ..” ఈమధ్య ఓ టీఆర్ఎస్ నాయకుడు మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పక్కవారు వారిస్తున్నా, అది సందర్భం కాదని చెప్పినా కూడా తమ కడుపుమంటని వెళ్లగక్కాడాయన. దాదాపుగా పార్టీని నమ్ముకుని, పదవులు దక్కని చాలామంది పరిస్థితి టీఆర్ఎస్ లో ఇలాగే ఉంది. మింగలేక, కక్కలేక అన్నట్టు ఉన్నారు నాయకులంతా.
ఈటల రాజేందర్ ని పార్టీ నుంచి సాగనంపిన తర్వాత కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ అంతు చిక్కకుండా ఉన్నాయి. అప్పటి వరకూ ఈటలకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఉన్నట్టుండి గులాబీ కండువా కప్పుకున్నారు. అయితే ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఇస్తారని అనుకున్నారంతా, కానీ కేసీఆర్ మాత్రం ఎమ్మెల్సీ సీటు ఆఫర్ చేసి అంతకు మించిన ఫేవర్ చేశారు.
ఈటల ఎఫెక్ట్ తోనే ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కూడా కేసీఆర్ పెద్ద ఆఫరే ఇచ్చారట. టీడీపీ తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎల్.రమణకు ఎమ్మెల్సీ ఖాయమని తెలుస్తోంది.
వీటికి తోడు ఇప్పుడు మోత్కుపల్లి నర్సింహుల్ని కేసీఆర్ నెత్తిన పెట్టుకోవడం మరీ విచిత్రంగా తోస్తోంది. టీడీపీలో ఉండగా కేసీఆర్ ని మోత్కుపల్లి ఎన్నెన్ని మాటలన్నారో అందరికీ తెలుసు. కేవలం కేసీఆర్ ని తిట్టడానికే ఆయన్ను ఉపయోగించుకున్నారు చంద్రబాబు. అవసరం తీరాక కూరలో కరివేపాకులా పక్కనపెట్టారు. కనీసం టీటీడీ చైర్మన్ పదవి అడిగినా కూడా కుదరదన్నారు. దీంతో మోత్కుపల్లి బీజేపీలో చేరారు. బీజేపీ కూడా ఆయన్ను మోసం చేసింది. గవర్నర్ రేసులో ఉన్నారన్నారు కానీ, ఫలితం లేదు. భవిష్యత్ లో కూడా ఫలితం ఉండదని తెలిసి చివరాఖరుకు టీఆర్ఎస్ లో చేరారు మోత్కుపల్లి.
దళిత నేత మోత్కుపల్లికి టీఆర్ఎస్ రెడ్ కార్పెట్ పరవడాన్ని ఎవరూ కాదనరు. కానీ పాత విషయాలన్నీ మరచిపోయి, నేరుగా ఆయన్ను దళితబంధు పథకానికి చైర్మన్ ని చేయాలనుకోవడంతో పార్టీలో ఉన్న చాలామంది దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నిజాయితీని, నిబద్ధతను పట్టించుకోకుండా, పార్టీలు మారి వచ్చిన మోత్కుపల్లిని కేసీఆర్ ఎందుకు నెత్తికెక్కించుకుంటున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు నేతలు.
వలస నేతలను అందలమెక్కించడం కేసీఆర్ కి కొత్తేమీ కాదు. తెలంగాణ ఉద్యమ సమయంలో, రాష్ట్ర విభజన సమయంలో టీడీపీ-కాంగ్రెస్ లో ఉండి టీఆర్ఎస్ తో విభేదించి, ప్రత్యేక తెలంగాణకు అడ్డుగా ఉన్న చాలామంది నాయకులను కేసీఆర్ ఆదరించారు, మంత్రి పదవులిచ్చి గౌరవించారు. వలస నాయకులు బెల్లం, సొంత పార్టీ నేతలు అల్లం అనే రీతిలో వ్యవహరించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ వ్యవహార శైలి సొంత పార్టీ నేతలకు మరింత విచిత్రంగా తోస్తోంది. అందుకే వారు కూడా బహిరంగ విమర్శలతో బయటపడుతున్నారు. సొంత పార్టీలో ఉండే కంటే, పక్క పార్టీలోకి వెళ్లి, మళ్లీ టీఆర్ఎస్ లోకి వస్తే పదవి వస్తుందంటూ సెటైర్లు వేస్తున్నారు.