ఫైబర్ గ్రిడ్ లీలలు.. అవాక్కయిన ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను, అక్రమాలను ఒక్కొక్కటే బైటపెడుతున్నారు. అమరావతి నుంచి, అమెరికా పర్యటనల వరకు ప్రతి దానిక వెనక ఉన్న మరో కోణాన్ని వెలికితీసి విచారణకు…

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను, అక్రమాలను ఒక్కొక్కటే బైటపెడుతున్నారు. అమరావతి నుంచి, అమెరికా పర్యటనల వరకు ప్రతి దానిక వెనక ఉన్న మరో కోణాన్ని వెలికితీసి విచారణకు వెళ్తామని చెబుతున్నారు మంత్రులు. ప్రాజెక్ట్ లు, అభివృద్ధి పథకాలు వేటినీ వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకూ ఏపీ ఫైబర్ గ్రిడ్ పథకంపై ఎక్కడా జగన్ సర్కార్ స్పందించలేదు.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరిరోజు మాత్రమే ఫైబర్ గ్రిడ్ ప్రస్తావన వచ్చింది. ఈ ఫైబర్ గ్రిడ్ చుట్టూ చాలా వ్యవహారం నడిచిందనేది మాత్రం వాస్తవం. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తిగా అవినీతి మయం. సెట్ టాప్ బాక్స్ ల కొనుగోలు దగ్గర్నుంచి, ఎమ్మెస్వోల ఎంపిక వరకు అన్నీ అక్రమమే. ప్రతి ఏరియాలో టీడీపీ చోటానేతలే ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని తీసుకున్నారు. టీడీపీ కార్యక్రమాలను ప్రసారం చేసే ఛానెల్స్ కి పెద్దపీట వేశారు, సాక్షిని చాన్నాళ్లు తొక్కిపెట్టారు.

ఇక ప్రజల దగ్గర నుంచి నెల నెలా వసూలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి కట్టలేదు. ఇలా కోట్ల రూపాయల మేత మేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెస్వోలందరూ తమ పప్పులుడకవని అర్థం చేసుకున్నారు. అందరూ ఒక్కటై ఐటీశాఖ మంత్రి మేకపాటి దగ్గర పంచాయతీ పెట్టారు. అయితే ఇది ఓ పట్టాన తెగలేదు. అవినీతి జరిగిందనేది వాస్తవం, దాన్ని చూసీ చూడనట్టు ఉండాలంటే కుదరదని మంత్రి కరాఖండిగా చెప్పేశారు.

అయితే ఎమ్మెస్వోలు మాత్రం పట్టువదల్లేదు. భారీ మొత్తానికి ఈ వ్యవహారాన్ని తెగ్గొట్టేయాలని, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ని ఈ ప్రభుత్వంలో కూడా యథావిధిగా కొనసాగించాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. దీంతో నెలరోజుల పాటు ఈ సమస్య నలుగుతూనే ఉంది. చివరకు సీఎం జగన్ దగ్గరకు వ్యవహారం వచ్చింది. అవినీతిని కూకటి వేళ్లతో పెకలించి వేస్తానని చెబుతూ వస్తున్న జగన్ ఈ వ్యవహారం చూసి విస్తుపోయారు. ఇన్నాళ్లు దీనిపై ఎందుకు విచారణ చేపట్టలేదని, ఇంత జరుగుతున్నా తన దృష్టికి ఎందుకు తేలేదంటూ సదరు మంత్రిని మందలించారు.

ఏపీ ఫైబర్ పీకి పారేస్తానని హెచ్చరించి, బకాయిలు కట్టాల్సిందే లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఎమ్మెస్వోల సంఘం నాయకుల్ని హెచ్చరించి పంపించేశారు సీఎం. దీని ఫలితంగా అసెంబ్లీ చివరిరోజు చర్చ మొత్తం ఏపీ ఫైబర్ గ్రిడ్ పైనే జరిగింది. చైనా నుంచి నాసిరకం సెట్ టాప్ బాక్స్ లు తెప్పించారని, కనీసం వాటికి పోర్ట్ లో దిగుమతికి కూడా అనుమతి లభించలేదని వైసీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా అవినీతిని బైటపెట్టారు. ప్రాజెక్ట్ మొత్తాన్ని టీడీపీ అనుచరుల చేతుల్లోనే పెట్టారని వివరించారు.

దీనిపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తీర్మానించారు. మొత్తమ్మీద సీఎం జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని ఏ దశలోనూ వదిలిపెట్టేది లేదని నిరూపిస్తూ వస్తున్నారు. దీనికి నిదర్శనంగానే ఫైబర్ గ్రిడ్ స్కామ్ మూలాలు కూడా కదులుతున్నాయి.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది