తెలంగాణలో ప్రస్తుతం వైసీపీ లేదు. కొంతమంది నేతలు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఒత్తిడి చేస్తున్నా తెలంగాణలో వైసీపీని కొనసాగించడం జగన్ కి ఇష్టం లేదు. అందుకే వైసీపీ తెలంగాణ చాప్టర్ ని శాశ్వతంగా క్లోజ్ చేశారు. కానీ చంద్రబాబు అలాకాదు. అక్కడా ఇక్కడా రెండుచోట్లా ఉండాలంటూ.. తనని తాను జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుని, రెండు తెలుగు రాష్ట్రాల శాఖలకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను ఎంపిక చేసుకున్నారు. ఇది చంద్రబాబు కుటిల రాజనీతిజ్ఞత. తెలంగాణలో ఒకటీ అరా సీట్లయినా దక్కకపోతాయా అని గోతికాడ నక్కలా చూస్తున్న చంద్రబాబుకి.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎందుకు గుర్తులేదు.
టీడీపీ జాతీయ పార్టీ, చంద్రబాబు జాతీయ పార్టీ అధ్యక్షుడైతే.. తెలంగాణలో తమ పార్టీ శాఖ కూడా ఉంది కదా.. ఆవిర్భావ దినోత్సవం రోజున కనీసం ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపే ఇంగితం కూడా బాబుకి లేదా. కరోనా లాక్ డౌన్ లో కుటుంబంతో సహా తెలంగాణలోనే తలదాచుకున్నారు కదా, మహానాడు తర్వాత ఇప్పుడు కూడా తెలంగాణలోనే ఉన్నారు కదా, ఆ రాష్ట్ర ప్రజలకు ఆమాత్రం శుభాకాంక్షలు తెలపలేరా?
ఏపీ ప్రజలు తిడతారని తెలిసి కూడా పవన్ కల్యాణ్ తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టి తిట్లు తిట్టించుకున్నారు. రాష్ట్రం విడిపోయిన బాధలో 10 రోజులకి పైగా ఉపవాసం చేశానన్న పవన్, ఇప్పుడు అమరవీరుల త్యాగఫలం తెలంగాణ అని పొగిడే సరికి సీమాంధ్రలో చాలామందికి కోపం నషాళానికెక్కింది. అది ఊహించిందే. మరి బాబుగారికేమైంది.
చంద్రబాబు కానీ, చినబాబు కానీ ఓ ట్వీట్ వేయలేదు, కనీసం తెలంగాణ టీడీపీ అకౌంట్ నుంచి పెట్టిన మెసేజ్ ని కూడా రీట్వీట్ కొట్టలేదు. అయితే అదే రోజు పుట్టినరోజు జరుపుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసైకి మాత్రం శుభాకాంక్షలు తెలిపి ఊరుకున్నారు బాబు. ఇక్కడే వీరి పిరికితనం బైటపడిపోయింది.
తెలంగాణ ఆవిర్భావదినోత్సవం రోజున శుభాకాంక్షలు తెలిపేట్లయితే, అమరవీరుల్ని పొగడాలి, తెలంగాణ పోరాటాలని ప్రశంసించాలి. అలా చేస్తే ఏపీలో విమర్శలు చెలరేగుతాయి. అందుకే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నా, ఆ పార్టీ నేతలు ఎన్టీఆర్ భవన్ లో వేడుకలు జరుపుకున్నా.. ఏమీ పట్టనట్టే ఉన్నారు చంద్రబాబు. నిజంగానే తెలంగాణ, ఏపీ చంద్రబాబుకి రెండు కళ్లయితే.. ఇప్పుడు ఆ కన్ను ఏమైనట్టు? బాబుగారి రెండు కళ్ల సిద్ధాంతం ఎటుపోయినట్టు?