హీరో నాగార్జున లేటెస్ట్ మూవీ ఘోస్ట్. ఈ సినిమా మీద చాలా హీరో నాగ్ చాలా నమ్మకం పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఎంత నమ్మకం అంటే ఆంధ్రలో మూడు ఏరియాలను తన ఖాతాలోకి తీసుకుని, తానే స్వయంగా పంపిణీ చేస్తుండడం. సాధారణంగా అంత నమ్మకం వుంటే ఏదో ఒక ఏరియా తీసుకుంటారు. అలా తీసుకున్నా కూడా ఎవరో ఒకరికి అప్పగించడమో, విక్రయించడమో చేస్తుంటారు. కానీ నాగ్ అలా కాకుండా నాలుగు ఏరియాలను తీసుకున్నారు. అవి కూడా తన అన్నపూర్ణ సంస్థ ద్వారా తనే పంపిణీ చేసుకుంటున్నారు.
ఒక యాంగిల్ లో చూసుకుంటే ఈ సినిమాకు నాగ్ కు గట్టి రెమ్యూనిరేషన్ కిట్టినట్లే. ఆంధ్రలోని కీలకమైన ఈస్ట్, వెస్ట్, వైజాగ్, గుంటూరు ఏరియాలు ఇప్పుడు నాగ్ తీసుకున్నారు పంపిణీ చేసుకుంటున్నారు. అంతే కాదు హిందీ వెర్షన్ ను నాగ్ నే తన ఖర్చులతో రిలీజ్ చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.
హిందీ డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ హక్కులు ఎప్పుడో విక్రయించేసారు. విడుదల చేయాలంటే అక్కడి బయ్యరు కు ఖర్చులు అవుతాయి. ఆ ఖర్చులు ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు అన్నది క్వశ్చను. ఈ విషయాన్ని కూడా నాగ్ నే డీల్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే రెమ్యూనిరేషన్ అంతటిని నాగ్ పణంగా పెట్టినట్లే.
ఇదంతా కాయిన్ కు ఒకవైపు. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఆసియన్ సునీల్, శరత్ మరార్, రామ్మోహనరావు నిర్మించిన ఘోస్ట్ సినిమా అదృష్టం కొద్దీ నాన్ థియేటర్ హక్కుల ఆదాయంతో బ్రేక్ ఈవెన్ అయిపోయంది. అందులో హీరో రెమ్యూనిరేషన్ లేదు. ఇప్పుడు ఆంధ్ర అంతా దాదాపుగా హీరో రెమ్యూనిరేషన్ కింద పోయినట్లు. సీడెడ్ పబ్లిసిటీ ఖర్చులకు వెళ్లిపోతుంది. ఇక నిర్మాతలు ముగ్గురికి మిగిలింది నైజాం ఆదాయం మాత్రమే.