గులాబీ అడుగులు.. పాత పార్టీకే కొత్త పేరు!

‘పాతసీసాలో కొత్త సారా’అనేది చాలా పాపులర్ సామెత. ప్రస్తుతం కేసీఆర్ ప్లాన్ చేస్తున్న జాతీయ పార్టీ వ్యవహారం కూడా అచ్చంగా అలాగే కనిపిస్తోంది. ఆయన అచ్చంగా కొత్త పార్టీ పెట్టబోవడం లేదు. ప్రస్తుతం ఉన్న…

‘పాతసీసాలో కొత్త సారా’అనేది చాలా పాపులర్ సామెత. ప్రస్తుతం కేసీఆర్ ప్లాన్ చేస్తున్న జాతీయ పార్టీ వ్యవహారం కూడా అచ్చంగా అలాగే కనిపిస్తోంది. ఆయన అచ్చంగా కొత్త పార్టీ పెట్టబోవడం లేదు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికే కొత్తగా జాతీయ పార్టీ రూపం ఇవ్వబోతున్నారు. కాకపోతే.. ‘తెలంగాణ’ అనే పేరు తగిలించుకుని పుట్టిన పార్టీకి జాతీయ రూపం అంటే జనం నవ్వుతారు గనుక.. పార్టీ పేరు మార్చి.. కొత్తగా చెలామణీలోకి తేవాలనేది ఆయన ఆలోచనగా వినిపిస్తోంది. ఈ సంగతే ఆయన అంటున్నట్టుగా దసరా నాటికి ప్రకటిస్తారనేది సమాచారం. 

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం తథ్యం అని ప్రకటించిన తర్వాత.. భారత రాష్ట్ర సమితి పేరుతో ఆయన కొత్త పార్టీ పెట్టబోతున్నారని చాలా ప్రచారం జరిగింది. ఆ పార్టీ జాతీయ రాజకీయాలకు మాత్రమే పరిమితమవుతుందని అన్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ.. దేశంలోని బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీన్నిటినీ ఒక గొడుగు కిందకు తేవడమే లక్ష్యంగా తన అడుగులు ప్రారంభించిన కేసీఆర్.. ఆలోచనను జాతీయ పార్టీగా తన పార్టీనే దేశమంతా విస్తరించేలా ప్లాన్ చేసుకున్నారు. అయితే భారత రాష్ట్ర సమితి అనేది తెరాసకే కొత్త పేరు కాబోతున్నదని సమాచారం. 

జాతీయ పార్టీగా రూపుదాలిస్తే.. తెలంగాణేతర ప్రాంతాల్లో కూడా పోటీచేయాలి. తెలంగాణ తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న కొన్ని ప్రాంతాల్లో పోటీకి కేసీఆర్ ఇప్పటికే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. కానీ ఆ అడుగులు ఎలా పడబోతున్నాయి? ఇతర రాష్ట్రాల్లో ఆయన సొంతంగా పోటీచేయగల సీట్లు ఎన్ని? ఏ రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకుని.. అక్కడి పార్టీలనుంచి సీట్లు పొందగల స్థితిలో ఉన్నారు? ఇవన్నీ ప్రశ్నలే.

కేసీఆర్ కు ఇంకో పెద్ద సమస్య ఉంది. ఆయన ఇప్పటిదాకా కలిసిన పార్టీల వారందరూ కూడా.. కాంగ్రెస్ కూడా ఉండవలసిన కూటమినే ఇప్పుడు అభిలషిస్తున్నారు. తద్వారా బిజెపి వ్యతిరేక ఓటు ఏమాత్రం చీలకూడదని అంటున్నారు. మరి కాంగ్రెస్ తో జట్టుకట్టే రాజకీయాలు కేసీఆర్ కు లోకల్ గా రాష్ట్రంలో చేటు చేస్తాయి కదా అనేది ఒక సందేహం. అలాంటప్పుడు కేసీఆర్ చిన్న డ్రామా నడిపించాల్సి వస్తుంది. 

తన పాత పార్టీకి కొత్త పేరును తగిలించిన తర్వాత.. అసెంబ్లీని రద్దు చేసి.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లి నెగ్గాలి. ఆ తర్వాత పార్లమెంటుకు జరిగే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ కూడా ఉండే కూటమితో.. ‘దేశ ప్రయోజనాల దృష్ట్యా’ జట్టు కట్టవచ్చు! అయినా ఇన్ని డొంకతిరుగుడు ప్రయోగాలు ఆయనకు ఫలితమిస్తాయో లేదో వేచిచూడాలి.