సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేరు వింటే వైసీపీ నేతలు మండిపతారు. తమ ఇష్టనాయకుడు వైఎస్ జగన్ను జైలుపాలు చేయడంలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించారంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో వైసీపీ ప్రముఖ నేత, ప్రసిద్ధ రచయిత డాక్టర్ ఎమ్వీ రమణారెడ్డి ఇంటికి లక్ష్మీనారాయణ వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కొన్ని వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా ప్రొద్దుటూరుకు లక్ష్మీనారాయణ బుధవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఇటీవల ఆప్కాబ్ చైర్పర్సన్ పదవిని దక్కించుకున్న డాక్టర్ ఎమ్వీఆర్ కోడలు మల్లెల ఝాన్సీరాణితో కలిసి లక్ష్మీనారాయణ ఓ ట్రాక్టర్ షోరూంను ప్రారంభించారు.
అనంతరం ఎమ్వీఆర్ను కలవాలనే తన కోరికను కుటుంబ సభ్యుల వద్ద ఆయన వ్యక్తపరిచారు. దీనికి సానుకూలంగా ఎమ్వీఆర్ స్పందించారు. ఈ నేపథ్యంతో బుధవారం రాత్రి ఎమ్వీఆర్ ఇంటికి లక్ష్మీనారాయణ వెళ్లారు.
ఒకవైపు వృద్ధాప్య సమస్యలు బాధిస్తున్నా, మరోవైపు మంచంపై నుంచే రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తున్న సంగతిని మీడియా ద్వారా తెలుసుకున్నట్టు ఎమ్వీఆర్ దృష్టికి లక్ష్మినారాయణ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్వీఆర్ దంపతులకు లక్ష్మీనారాయణ పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. ఎమ్వీఆర్ను సత్కరించారు.
ప్రపంచ ప్రసిద్ధ రచన గోర్కీ నవల “మదర్” తెలుగు అనువాదం పూర్తయినట్టు ఎమ్వీఆర్ తెలిపారు. రాయలసీమ సాగు, తాగునీటి సమస్యలు, అలాగే ఉత్తమ రచనలపై వాళ్లిద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది.