నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తన పార్టీకే చెందిన వైసీపీ ఎంపీలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. కేంద్రన్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు వైసీపీ ఎంపీలు చేసిన విజ్ఞప్తి చూస్తుంటే వారిపై జాలి వేయకుండా ఉండదు. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని పదేపదే లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా… వైసీపీ ఆశించిన ఫలితం రాలేదు.
దీంతో వైసీపీ ఒకింత తీవ్ర నిరాశ, అలాగే మోడీ సర్కార్‌పై ఆగ్రహంగా కూడా ఉంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు కోసం ఏకంగా రాజ్యాంగ సవరణే చేయాలని వైసీపీ డిమాండ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు న్యాయశాఖ మంత్రికి విజ్ఞాపన చేయడం అందులో భాగంగానే చూడాలి.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే సభ్యులపై అనర్హత వేటుకు కచ్చితమైన గడువు విధించేలా రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో విజ్ఞప్తి చేశారు.
‘అనర్హత పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకోవడానికి నిర్దిష్టమైన గడువును స్పష్టంగా పేర్కొనకపోవడంతో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లక్ష్యం నెరవేరలేదు. చట్టంలోని లొసుగును ఫిరాయింపుదారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. జేడీ(యూ) సభ్యుడు శరద్ యాదవ్‌కు వ్యతిరేకంగా దాఖలైన అనర్హత పిటిషన్‌పై మూడు నెలల్లో నిర్ణయం తీసుకుని రాజ్యసభ ఛైర్మన్ సత్సంప్రదాయాన్ని నెలకొల్పారు. దానిని ప్రమాణంగా తీసుకుని లోక్‌సభ, రాష్ట్ర శాసనసభ, మండళ్లలో అమలుకు వీలుగా పదో షెడ్యూల్‌ను సవరించాలి’ అని వారు విజ్ఞప్తి చేశారు.
పార్టీ ఫిరాయింపు చట్టంపై వైసీపీకి ఎందుకంత ఆసక్తో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫిరాయింపులపై కచ్చితమైన గడువు విధిస్తే రఘురామకృష్ణంరాజుపై వేటు వేయడం ఈజీ అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. చట్టంలోని లొసుగును ఫిరాయింపు దారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని రఘురామకృష్ణంరాజును దృష్టిలో పెట్టుకుని వైసీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
రఘురామపై వేటు వేయాలనే ప్రయత్నాలు …ఇక మిగిలిన మూడేళ్లలో అయినా ఫలిస్తాయా? అన్నది ఓ పెద్ద ప్రశ్నే అని చెప్పక తప్పదు. ఒక్క రఘురాముడు వైసీపీ ఎంపీలందరినీ ఏ విధంగా ముప్పుతిప్పలు పెడుతున్నారో అర్థం కావడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?