ఇటీవలి నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులను పొందిన నేతలు ఒక్కొక్కరుగా ఇప్పుడు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నామినేషన్ పదవుల భర్తీ నియామకాల గురించి ప్రకటన వచ్చి ఇప్పటికే రెండు వారాలకు పైనే గడిచింది.
నేతల తమ తమ సంతోషాలను అప్పట్లోనే వ్యక్తీకరించారు. అయితే కొందరు బాధ్యతల స్వీకారాన్ని కాస్త ఆలస్యం చేశారు. ఆషాడమాసం అయిపోయాకా..ఇప్పుడు తీరికగా సుమూహార్తాల్లో నేతలు పదవీ స్వీకారాలు చేస్తున్నారు.
అందుకు సంబంధించి సందడి నెలకొందిప్పుడు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో.. మంచి ముహూర్తాల నేపథ్యంలో నేతలు ప్రమాణ స్వీకారాలతో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా.. తమకంటూ చెప్పుకోవడానికి ఎలాంటి పదవులు లేని నేతల్లో చాలా మందికి ఇప్పుడు అవకాశం లభించిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవలేకపోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కేవలం 24 మంది మాత్రమే. వారిలో చాలా మందికి ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీతో నిమిత్తం లేకుండానే పదవులు లభించాయి. కొందరు ఎమ్మెల్సీలయ్యారు, ఇద్దరు రాజ్యసభ సభ్యులయ్యారు. కేవలం పరిమిత సంఖ్యలోని నేతలు మాత్రమే అలా మిగిలారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఓడిపోయిన వారి కన్నా.. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, టికెట్ పొందలేకపోయిన వారికే ప్రాధాన్యత లభిస్తూ వస్తోంది. జగన్ కోరిన సమయంలో టికెట్ త్యాగం చేసిన వారు, నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలను వదులుకున్న వారు, అప్పటికే ఒకసారి పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిని మిగుల్చుకున్న వారికి ఇప్పుడు ప్రాధాన్యత లభించింది.