ఉన్నదే ఒక్క ఎమ్మెల్యే.. కానీ వెంటరాలేదు!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల ఫోకస్ తో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. హైదరాబాదులో ఉంటూ, అప్పుడప్పుడూ విజయవాడ వెళ్లి.. నాలుగైదు రోజుల పాటూ ఏకబిగిన ఏపీ రాజకీయాలను…

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల ఫోకస్ తో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. హైదరాబాదులో ఉంటూ, అప్పుడప్పుడూ విజయవాడ వెళ్లి.. నాలుగైదు రోజుల పాటూ ఏకబిగిన ఏపీ రాజకీయాలను స్పృశించి, అరచి గీపెట్టి మళ్లీ షెల్ లోకి వెళ్లిపోయే పవన్ కల్యాణ్.. ప్రస్తుత కార్యకలాపాలు కొన్ని కొత్త అనుమానాల్ని పుట్టిస్తున్నాయి. ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా దూరమవుతారా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.

రాష్ట్రానికి కొత్తగా గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన మందీ మార్బలంతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. శుభాకాంక్షలు తెలిపారు. అయితే గవర్నర్ వద్దకు వెళ్లిన బృందంలో ఆ పార్టీకి శాసనసభలో పరువు నిలబెట్టిన ఒకేఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రంలేరు. పవన్, నాదెండ్ల మనోహర్, నాగబాబు ప్రభృతులు మాత్రమే ఉన్నారు. తమకు ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను పవన్ వెంట తీసుకెళ్లలేదా, ఆయనే ఆ బృందానికి దూరంగా ఉండిపోయారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

రాపాక వరప్రసాద్.. జనసేన గుర్తు మీద ఒకేఒక్కడుగా గెలిచినప్పటికీ.. భవిష్యత్తు అంతా అగమ్యగోచరమే గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి చూస్తున్నట్లుగా తొలినాళ్లలో వార్తలు వచ్చాయి. అయితే ఫిరాయింపుల విషయంలో చాలా నిక్కచ్చిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి.. రాజీనామా చేసి వస్తేతప్ప ఎవరినీ చేర్చుకునే ఉద్దేశం లేదని పలుమార్లు స్పష్టంచేశారు. అయితే శాసనసభలో జగన్ ప్రభుత్వ అనుకూల ప్రసంగాల ద్వారా.. తాను వారికి దగ్గరి మనిషినే అని రాపాక వరప్రసాద్ నిరూపించుకున్నారు కూడా.

ఇలాంటి నేపథ్యంలో.. రాపాకను పార్టీ పొలిటికల్ కమిటీలో పవన్ నియమించారు గానీ. దానికి తగినట్లుగా ఆయనకు ప్రాధాన్యం యిస్తున్నారా? అనేది అనుమానమే. అందువల్లనే రాపాక కూడా అంటీ ముట్టనట్లుగా దూరం మెలగుతున్నారేమో అని కూడా పలువురు అనుకుంటున్నారు. అది నిజం కాకపోతే.. విజయవాడలో గవర్నర్ ను కలవడానికి పార్టీ అధినేత వెంట వెళ్లిన బృందంలో, ఆ సమయానికి అసెంబ్లీ సమావేశాల పుణ్యమాని విజయవాడలోనే ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎందుకు వెళ్లరంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది