తలాక్‌కు చెక్ : శ్రీకారం మాత్రమే

ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా భార్యను ‘వదిలించుకునే’ పోకడకు ఈ దేశంలో ఇక చెక్ పడినట్లే. అనేక ముస్లిం దేశాలలో కూడా ఇది అమల్లో లేకపోయినప్పటికీ.. మైనారిటీ హక్కుల కింద మనదేశంలో మాత్రం ఇప్పటిదాకా…

ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా భార్యను ‘వదిలించుకునే’ పోకడకు ఈ దేశంలో ఇక చెక్ పడినట్లే. అనేక ముస్లిం దేశాలలో కూడా ఇది అమల్లో లేకపోయినప్పటికీ.. మైనారిటీ హక్కుల కింద మనదేశంలో మాత్రం ఇప్పటిదాకా చెలామణీ అవుతూ వచ్చింది. ఇప్పుడు తాజాగా రాజ్యసభలో కూడా ఈ బిల్లు నెగ్గడం ద్వారా చరమగీతం పలికినట్లయింది. ఇక తలాక్ అనేపదాన్ని ఉచ్చరించి, భార్యను బయటకు గెంటేయదలచుకునే భర్త మూడేళ్ల జైలుశిక్షకు సిద్ధపడాల్సి ఉంటుంది.

భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ నేతృత్వంలో రెండోసారి కూడా స్పష్టమైన మెజారిటీతో నెగ్గిన తర్వాత.. గత అయిదేళ్ల పాలనలో వారిలో వారే సంశయిస్తూ వచ్చిన అనేక కఠిన నిర్ణయాలను అమ్ముల పొదిలోంచి ఒక్కటొక్కటిగా బయటకు తీస్తారని అంతా అనుకున్నారు. ఆ క్రమంలో తలాక్ బిల్లు మొదటి అడుగు మాత్రమే అని భావించాల్సి ఉంటుంది. హిందూత్వ ఎజెండా బిల్లులుగా రాజకీయ ప్రత్యర్థులు ముద్రవేస్తూ ఉండే అనేకానేక బిల్లులు, ఇక వరుసగా ప్రాణం పోసుకోవచ్చు. రాజ్యసభలో కూడా వివాదాస్పద బిల్లులను నెగ్గించుకోగల బలం భాజపాకు ప్రస్తుతం చేకూరినదనడానికి, తలాక్ బిల్లు ఉదాహరణ. ఈ పోకడ వారు యథేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి దారితీస్తుంది.

గత అయిదేళ్ల పాలనలో మోడీ సర్కారు కొన్ని వివాదాస్పద కీలక నిర్ణయాల విషయంలో ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. ఆ ప్రభుత్వానికి రాజ్యసభలో బిల్లు నెగ్గించుకోగల బలం అప్పట్లో లేదు. దానికి తగ్గట్టుగానే వారు పావులు కదుపుతూ వచ్చారు. ఆరెస్సెస్ ఎజెండాగా భాజపా సర్కారు ప్రధానమైనవిగా భావించే అనేక అంశాల జోలికి వారు వెళ్లలేదు. రెండోసారి గద్దెఎక్కిన తర్వాత.. తెదేపా నలుగురు సభ్యులను కూడా తమలో కలిపేసుకున్నాక.. రాజ్యసభలో ఇంకా సంపూర్ణంగా బలం సమకూరకపోయినా.. బిల్లులు నెగ్గించుకోగలమా లేదా అని వారు చేసుకున్న సెల్ఫ్ చెక్.. ఈ తలాక్ బిల్లు. సక్సెస్ అయ్యారు.

ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ ప్రత్యేకహక్కుల రద్దు, రామమందిర నిర్మాణం వంటి అనేక కీలకమైన విషయాలు భాజపా సర్కార్ ఆలోచనల్లో ఉన్నాయి. అవి తలాక్ బిల్లును మించి, దేశంలో రేకెత్తించగల సంచలనం వారికి తెలుసు. అందుకే.. ఇప్పటిలాగా కొందరి గైర్హాజరీలను నమ్ముకోకుండా.. ఏకంగా రాజ్యసభలోనూ పూర్తిబలం సమకూరగానే.. తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ ప్రభుత్వ పదవీకాలం పూర్తయ్యేలోగా ఆరెస్సెస్ ఎజెండాగా చాలాకాలంగా వార్తల్లో ఉన్న అంశాలన్నీ చట్టాలుగా మారినా ఆశ్చర్యంలేదు.

రాజకీయ నటన కంటే సినిమాల్లో నటన మంచిది