ఆయన ఆజానుబాహుడు. ఎత్తుతో పాటు ఒడ్డు కూడా ఉంటారు. ఆయనే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన్ని పట్టుకుని చటుక్కున పానకంలో పుడక అనేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం. దాని వెనక వ్యంగ్యం అచ్చెన్నకే అర్ధం కావాలేమో. తెలుగుదేశం పార్టీలో అన్ని వ్యవహారాలు పెదబాబు, చినబాబే చూసుకుంటారు అని అంటారు.
అచ్చెన్నాయుడు పేరుకు పాత్రమే ప్రెసిడెంట్ అని స్వపక్షంతో పాటు విపక్షంలోనూ సెటైర్లు పడుతూంటాయి. దాంతోనే ఇపుడు పానకంలో పుడకలా మధ్యన నీవెందుకు అచ్చెన్నా ఏకంగా ఏదైనా మాతో మాట్లాడాలీ అంటే మీ బాస్ చంద్రబాబే వస్తే సరిపోలా అని తమ్మినేని అంటున్నారు.
ఉత్తరాంధ్రాలో అభివృద్ధి వైసీపీ హయాంలో ఏమీ జరగలేదని, చర్చకు తాను సిద్ధమని అచ్చెన్న తాజాగా సవాల్ చేశారు. దానికి కౌంటర్ గా తమ్మినేని నీ సవాల్ కి మేము జవాబు చెప్పం పెదబాబునే నేరుగా రప్పిస్తే ఆయనతోనే ఉత్తరాంధ్రాకు టీడీపీ ఏం చేయలేదో చెప్పి వైసీపీ అభివృద్ధిని వివరిస్తామని ఘాటైన బదులిచ్చారు.
ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళంలో భావనపాడు పోర్టుతో పాటు తమ్మినేని సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో అగ్రికల్చర్ పాలిటిక్నిక్ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఉత్తరాంధ్రాలో జిల్లాకో వైద్య కళాశాల మంజూరు చేసింది. చాలా పరిశ్రమలు వస్తున్నాయి. ఇవన్నీ అభివృద్ధి కావా, గుడ్డిగా విమర్శలు చేసే వారికి ఏమీ కనిపించవంటూ తమ్మినేని అచ్చెన్నకు కౌంటర్ ఇచ్చారు.