పోయిన చోట వెతుక్కోవాలని సామెత. రాజకీయ నాయకులకు ఈ సామెత బాగా వర్తిస్తుంది. ఇక జనసేన ఉత్తరాంధ్రా జిల్లాలలో తన బలాన్ని చాటుకోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో ఆ పార్టీ నాయకుడిగా నాగబాబు ఈ జిల్లాలలో టూర్ చేస్తున్నారు.
ఆయన తన టూర్ సందర్భంగా పార్టీ పరిస్థితి మీద సమీక్ష చేస్తూనే మాజీ ప్రజారాజ్యం పార్టీ నాయకుల గురించి కూడా ఆరా తీస్తున్నట్లుగా చెబుతున్నారు. 2009 ఎన్నికల వేళ వెల్లువలా ఈ జిల్లాలలో నాయకులు వచ్చి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. వారిలో చాలా మంది అంగబలం, అర్ధబలం కలిగిన వారు ఉన్నారు.
కాలగమనంలో ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చేయడంతో వారంతా వేరు వేరు రాజకీయ మార్గాలను చూసుకున్నారు. అయితే ఇపుడు జనసేన వారి గురించి వెతుకుతోందని అంటున్నారు. ఆ నాయుకులు కనుక తిరిగి వస్తే జనసేన మరింతంగా బలోపేతం అవుతుందని చెబుతున్నారు.
అదే విధంగా ఇతర పార్టీల నుంచి నాయకులు ఎవరెవరు ఎక్కడ బలంగా ఉన్నారు. వారిలో పక్క చూపులు చూసేవారు ఎవరు, ఇలాంటి విషయాల మీద కూడా జనసేన దృష్టి పెట్టిందని అంటున్నారు.
చాలా చోట్ల నియోజకవర్గాలలో బలమైన నాయకుల కోసం జనసేన వేట మొదలెట్టినట్లుగా తెలుస్తోంది. పవన్ వదిలిన నాగాస్త్రం ఉత్తరాంధ్రాలో ఎంతమేరకు పనిచేస్తుంది అన్నది చూడాలి.