హుజూరాబాద్ ఉప ఎన్నికకు చాలా ముందుగానే అభ్యర్థిని ప్రకటించేసింది టీఆర్ఎస్. ఇటీవలి కాలంలో ఉప ఎన్నికలు వచ్చిన సమయాల్లో అభ్యర్థిని ప్రకటించే విషయంలో టీఆర్ఎస్ ఆఖరి వరకూ అధికారిక నిర్ణయాలను ప్రకటించడానికి తటపటాయించింది. అయితే టీఆర్ఎస్ కు సవాల్ గా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో మాత్రం ముందుగానే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన వచ్చింది.
ఇప్పటికే అక్కడి కాంగ్రెస్ ఇన్ చార్జిని చేర్చేసుకున్నారు, ఎమ్మెల్సీ పదవిని కూడా ఇచ్చేశారు. భారీ ఎత్తున అక్కడ నుంచినే సంక్షేమ పథకాలకు తెర తీశారు. ఇలా ఉప ఎన్నికకు అన్ని విధాలుగానూ రెడీ అయిన టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో మాత్రం ఒకింత సంచలన నిర్ణయమే తీసుకుంది.
ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన వారు.. ఇక్కడి మాజీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నా.. గెల్లు శ్రీనివాసయాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్ఎస్.
టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో పని చేసిన నేపథ్యం ఉన్న గెల్లు శ్రీనును అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ఈటలకు కేసీఆర్ గట్టిగానే చెక్ పెట్టారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈటల తన విషయంలో చేసుకుంటున్న సానుకూల ప్రచారాలన్నింటికీ గెల్లు శ్రీనుతో కౌంటర్ ఇచ్చేందుకు అవకాశం ఉంది.
ముందుగా.. ఈటల తెలంగాణ ఉద్యమ నేపథ్యం గురించి చెప్పుకుంటే, గెల్లు శ్రీను కూడా అదే నేపథ్యమే. ఈటల అప్పటికే ఎమ్మెల్యే కావొచ్చు. అయితే గెల్లు శ్రీను అనేక కేసులు ఎదుర్కొని నెలల పాటు జైల్లో ఉన్నారట. ఇక బీసీ నేపథ్యం.. ఈ విషయంలో కూడా ఈటలకు గెల్లు శ్రీనుతో చెక్ పడుతుంది.
అటు బీసీలకూ ప్రాధాన్యత, ఇటు ఉద్యమ నేపథ్యం.. రెండూ టీఆర్ఎస్ కు సానుకూలాంశాలే అవుతాయి. ఒకవేళ ఏ కౌశిక్ రెడ్డికో మరొకరికో టికెట్ కేటాయించి ఉంటే.. అది నైతికంగా ఈటలకు ప్లస్ పాయింట్ అయ్యేది.
సామాజికవర్గం, ఉద్యమ నేపథ్యం.. అంటూ హైలెట్ చేసుకునే అవకాశం అప్పుడు ఈటలకు ఉండేది. అయితే కౌశిక్ రెడ్డిని చేర్చుకున్న వెంటనే, ఎమ్మెల్సీని చేయడం, మరోవైపు నుంచి బీసీ అభ్యర్థిని ప్రకటించడం ద్వారా.. కేసీఆర్ గట్టి పంచ్ ఇచ్చారు. మరి ఇది నాకౌట్ పంచ్ అవుతుందా లేక పోలింగ్ కు ముందు గేమ్ పాయింట్ అవుతుందో!