ఈమధ్య ఆర్ఆర్ఆర్ సినిమాకు నాన్-థియేట్రికల్ రైట్స్ కింద ఏ రేంజ్ లో డీల్స్ సెట్ అయ్యాయో చూశాం. వందల కోట్ల రూపాయల బిజినెస్ చేసింది రాజమౌళి సినిమా. యష్ హీరోగా నటిస్తున్న కేజీఎఫ్2 కూడా ఏమాత్రం తక్కువ కాదు. ఈ సినిమాకు అంతకంటే ఎక్కువ మొత్తానికే ఆఫర్లు వస్తున్నాయి. కాకపోతే అవన్నీ డైరక్ట్ ఓటీటీ రిలీజ్ ఆఫర్లు.
అవును.. కేజీఎఫ్2 సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తే కళ్లుచెదిరే మొత్తం ఇస్తామంటూ ఓటీటీ సంస్థ ఒకటి మేకర్స్ కు భారీ ఆఫర్ ఇచ్చింది. థియేట్రికల్ రిలీజ్ ను వదులుకుంటే భారీ రేటు ఇస్తామంటూ ఊరించింది. అయితే కేజీఎఫ్2 డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు మేకర్స్ అంగీకరించలేదు.
నిజానికి ఈ కరోనా టైమ్స్ లో థియేట్రికల్ రిలీజ్ అంటే రిస్క్ చేయడమే. కేజీఎఫ్2 లాంటి పాన్ ఇండియా సినిమాలకు ఇది మరీ కష్టం. అయినప్పటికీ యష్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని, కష్టమైనా థియేట్రికల్ రిలీజ్ కే వెళ్లాలని టీమ్ నిర్ణయించింది.
ఒకవేళ థియేట్రికల్ రిలీజ్ మరీ కష్టమైతే.. సౌత్ లో (తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో) ముందుగా సినిమాను రిలీజ్ చేసి, ఆ తర్వాత పరిస్థితుల బట్టి నార్త్ లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో కూడా యూనిట్ ఉంది. అంతేతప్ప, డైరక్ట్ ఓటీటీకి వెళ్లే ఉద్దేశ్యం ఎంతమాత్రం లేదు. ఇదే విషయాన్ని గతంలో యష్ కూడా ప్రకటించాడు. ''ఎన్ని రోజులు పడుతుందనేది అనవసరం. ఎన్ని రోజులు లేట్ అయినా థియేటర్లలోకే వస్తాం'' అన్నాడు యష్.
దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయింది కేజీఎఫ్ సినిమా. వందల కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. అలాంటి సినిమాకు సీక్వెల్ గా వస్తోంది కేజీఎఫ్2. ఈసారి సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ కు చోటిచ్చారు.