జగన్ లెక్కప్రకారం, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి పదవీకాలం ముగిసిన తర్వాత రెండోసారి అవకాశం ఇవ్వకూడదు. ఇచ్చినా ఆయన సేవలను మరో విధంగా ఉపయోగించుకునేవారే కానీ, అదే ప్లేస్ కి పంపించడానికి వీల్లేదు. కానీ జగన్ టీటీడీ చైర్మన్ గా సుబ్బారెడ్డికి రెండోసారి అవకాశం ఇచ్చారు. ఈ విషయమే ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా ఏపీ మంత్రుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
పదవీకాలం ముగిశాక దగ్గరి బంధువైన వైవీ సుబ్బారెడ్డి లాంటి సీనియర్ నే పక్కకు తప్పించిన జగన్, మంత్రులపై కూడా వేటు వేస్తారనే అనుకున్నారంతా. కానీ సుబ్బారెడ్డి విషయంలో స్క్రీన్ ప్లే మారింది. తిరిగి ఆయనకు అదే పోస్ట్ వచ్చింది. దీంతో మంత్రులకు ఇదొక సెంటిమెంట్ గా మారింది.
సుబ్బారెడ్డి టైపులో తమను కూడా మంత్రి పదవుల్లో కొనసాగిస్తారని, కొందరు మంత్రులు ఆశపడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వంపై ఎక్కడా పెద్దగా వ్యతిరేకత లేదు. మంత్రులకు ఆ స్థాయిలో సీఎం కూడా స్వేచ్ఛ ఇవ్వలేదు.
ఎక్కడ ఎవరు మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా జగన్ పర్మిషన్ కావాల్సిందే. ఈ దశలో మంత్రులపై ప్రజల్లో న్యూట్రల్ ఫీలింగ్ ఉంది. అంటే వారిని మార్చినా, మార్చకపోయినా ఏమాత్రం ఇబ్బంది లేదు. అయితే కొత్తగా పదవులు ఆశిస్తున్నవారికి న్యాయం చేయాలంటే మాత్రం పాతవారిని తప్పించాల్సిందే. రెండోసారి సామాజిక న్యాయం జరగాల్సిందే.
కొత్తవారి కోసం పాతవారిని సాగనంపడం రిస్కా, లేదా పాతవారిని కంటిన్యూ చేసి కొత్తవారికి వచ్చే ప్రభుత్వంలో అవకాశం ఇస్తామని హామీ ఇవ్వడం రిస్కా..? ఈ రెండిటిలో ఏది పెద్ద రిస్క్ అని ఆలోచిస్తున్నట్టున్నారు జగన్. టీటీడీ విషయంలో మరీ ఎక్కువ రిస్క్ చేయలేక సుబ్బారెడ్డినే సర్దుబాటు చేసి పనికానిచ్చేశారు.
రేపు మంత్రి వర్గ విస్తరణ విషయంలో కూడా ఇదే జరగాలని ఆశిస్తున్నారు అమాత్యులు. తమ సీటు కిందకు నీళ్లు రాకుండా ఉంటే చాలనుకుంటున్నారు.