ఎల్లో మీడియాధిపతి వేమూరి రాధాకృష్ణకు మరోసారి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహంతో బహిరంగ లేఖ రాశారు. గతంలో తనపై అబద్ధాలు వండి వార్చారని రాధాకృష్ణను నానా తిట్లు తిడుతూ సోము వీర్రాజు లేఖ రాసిన సంగతి తెలిసిందే. సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడం ఎల్లో మీడియాధిపతి ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. వీర్రాజు ఏపీ బీజేపీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఆ పార్టీని దూరంగా పెడుతూ వస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన మద్దతు లేనిదే టీడీపీ గట్టెక్కలేదని రాధాకృష్ణ భయం. దీంతో వీర్రాజును తప్పించేందుకు ఆయన తన మార్క్ జర్నలిజం అస్త్రాన్ని ఆయనపై ప్రయోగిస్తున్నారు. ఇటీవల ఏపీ బీజేపీ నేతలపై వరుస అవినీతి కథనాలను ఆంధ్రజ్యోతిలో రాశారు. ఈ కథనాలపై సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ప్రతిష్టను దెబ్బ తీసేలా కథనాలు ఉన్నాయని రాధాకృష్ణకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ఈ బహిరంగ లేఖలో ఆంధ్ర జ్యోతిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సెప్టెంబర్ 6, 18, 24 తేదీల్లో రాసిన కమలం నేత కోట్లలో మేత, వసూళ్లపై ఢిల్లీ కూపీ, కమలంలో కలెక్షన్ క్వీన్ అనే కథనాల గురించి సోము వీర్రాజు ప్రత్యేకంగా ప్రస్తావించారు. బీజేపీ నేతల అవినీతికి సంబంధించి నిరాధార కథనాలు రాశారని ఆయన తప్పు పట్టారు.
కేవలం బీజేపీ మీద బురదజల్లి, ప్రజల్లో అపోహలు, అనుమానాలు, ఆగ్రహాన్ని రేపి పార్టీని దెబ్బతీయడమే లక్ష్యంగా పైన పేర్కొన్న మూడు కథనాల లక్ష్యంగా కనిపిస్తోందని నిష్టూరమాడారు. ఆంధ్రజ్యోతి ఒక స్వతంత్ర మీడియా సంస్థ అని మీరు మీకు ఊహించుకోవచ్చని వెటకరించారు. ఈ మాటతో ఆంధ్రజ్యోతి స్వతంత్ర మీడియా సంస్థ కాదని ఆయన చెప్పకనే చెప్పారు. బీజేపీ అవినీతి కథనాలు ఎల్లో జర్నలిజంగా, రాజకీయ ప్రేరేపితాలుగా సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇలాంటి రాతలు ఎంత మాత్రం జర్నలిజం విలువలకు ప్రతీక కాదని ఆయన హితవు పలికారు.
తమ పార్టీ నాయుకుల అవినీతికి సంబంధించి ఆధారాలుంటే వారంలో ఇవ్వాలని, తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పు కొచ్చారు. ఒకవేళ రుజువులు ఇవ్వకపోతే, తప్పుడు కథనాలు ప్రచురించి తమ పార్టీ పరువు ప్రతిష్టలు, కార్యకర్తల గౌరవ మర్యాదలు కాపాడుకోడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సోము వీర్రాజు బహిరంగ లేఖలో రాధాకృష్ణకు గట్టి హెచ్చరిక చేయడం చర్చనీయాంశమైంది.