రాయలసీమ ప్రాంతంలో ఒక సామెత ఉంటుంది. హుస్సేనప్ప తాడిమర్రికి వెళ్లొచ్చినట్టు.. అని, ఒక రాత్రి హుస్సేనప్ప తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నారట, పొద్దున్నే హుస్సేనప్పను తాడిమర్రికి పంపింద్దాం అని వారు మాట్లాడుకోవడం అతడికి వినపడిందట. ఆ మాట వినేసి, లేవగానే తాడిమర్రికి వెళ్లొచ్చాడట హుస్సేనప్ప. ఎందుకు వెళ్లాడో, ఎందుకు వచ్చాడో తనకే తెలియదు!
అచ్చంగా ఆ పిట్టకథలోని హుస్సేనప్ప తీరున ఉంది తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి తీరు. కరోనా వేళ ఆయన ఎందుకు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి, మళ్లీ ఎందుకు హైదరాబాద్ కు చేరుకున్నారో ఎవరికీ తెలియదు. జూమ్ మహానాడును నిర్వహించడానికి అయితే అది హైదరాబాద్ లో తను రెండు నెలలుగా తలదాచుకున్న సొంతింటి నుంచినే నిర్వహించుకోవచ్చు! ఆ మాత్రం దానికి ఆయన అమరావతికి రావాల్సిన అవసరం ఏమిటో అనేది నెటిజన్ల ప్రశ్న!
చంద్రబాబు నాయుడు అభిమానులు ఆయన ఏపీలో అడుగుపెడుతున్న తరుణంలో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ హడావుడి చేశారు. అయితే కొన్ని గంటల్లోనే సదరు బిగ్ బాస్ తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. మరి ఇవన్నీ చంద్రబాబు చేస్తున్న వీకెండ్ పాలిటిక్స్ లో భాగమా?
కరోనాకు ముందు కూడా చంద్రబాబు నాయుడు వారాంతాల్లో ఏపీలో ఉండేవారు కాదు, ఐటీ ఉద్యోగుల్లా చంద్రబాబు నాయుడు, లోకేష్ లు శుక్రవారం రాత్రే హైదరాబాద్ చేరుకునే వారు. అంతకు ముందు హైదరాబాద్ లో ఉండటం దోషమని, నేరమని తెలుగుదేశం గగ్గోలు పెట్టినా, ప్రతిపక్షంలోకి వెళ్లాకా చంద్రబాబు నాయుడు మాత్రం వారాంతంలో హైదరాబాద్ చేరడం కొనసాగిస్తూ వచ్చారు. ఇంకా కరోనా కష్టాలు తీరలేదు.. అయినా చంద్రబాబు నాయుడు వీకెండ్ ప్రయాణాలు, హుస్సేనప్ప చందాన అటూ ఇటూ తిరడం ఎందుకో! అనేది నెటిజన్లు వేస్తున్న ప్రశ్న!