దేశంలో కోవిడ్-19 వల్ల మరణించే వారి శాతం తగ్గుముఖం పడుతోందని అంటోంది కేంద్ర ప్రభుత్వం. కరోనా వైరస్ సోకినా కోలుకునే వారి శాతం బాగా పెరుగుతూ ఉందని, ఇదే సమయంలో మొదటితో పోలిస్తే ఇప్పుడు కరోనా వల్ల చోటు చేసుకున్న మరణాల శాతం తగ్గుముఖం పట్టిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొన్ని దేశాలతో పోల్చినా, మొదట్లో ఇండియాలో నమోదైన శాతంతో పోల్చినా.. ఇప్పుడు ఫెటలిటీ రేటు తగ్గిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
45 రోజుల కిందటి లెక్కల ప్రకారం కోవిడ్-19 ఫెటలిటీ రేటు 3.3 శాతం కాగా, ఇప్పుడు అది 2.83 శాతానికి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కోవిడ్-19 వల్ల చోటు చేసుకున్న మరణాల్లో కూడా కొందరు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారున్నారనే విషయాన్నీ ఇది వరకూ కేంద్రం ప్రకటించింది. ఆరోగ్యంగా ఉన్న వారిలో ఎవరికైనా కరోనా వైరస్ సోకినా వారు కోలుకుంటారు అనే నమ్మకాన్ని మరింత బలపరుస్తూ ఉంది కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా ప్రకటన.
కరోనా వైరస్ సోకిన వారిలో కోలుకుంటున్న వారి శాతం నిత్యం పెరుగుతూ ఉండటాన్ని కూడా గమనించవచ్చు. ప్రస్తుతం ఇండియాలో కరోనా రికవరీ రేటు 48.19 అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం కేసుల సంఖ్య దాదాపు 2 లక్షలకు చేరగా, అందులో ఇప్పటికే లక్ష మంది వరకూ కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇతరులకు చికిత్స కొనసాగుతూ ఉంది.
ఇక అంతర్జాతీయంగా సగటున కరోనా ఫెటలిటీ రేటు ఆరు శాతానికి పైనే ఉండటం గమనార్హం. ఫ్రాన్స్ లో అయితే 19 శాతం ఉంది ఈ రేటు. బెల్జియం, ఇటలీ, యూకేల్లో కూడా ఎక్కుశాతం నమోదు అయ్యింది. అంతర్జాతీయ సగటు ఆరు శాతంతో పోల్చినా ఇండియాలో కరోనా ఫెటలిటీ రేటు చాలా తక్కువని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.