హోమియోపతి గొప్పదా, అల్లోపతి మేలా, నేచురోపతి బెటరా.. అనే చర్చ వస్తే దానికి అంతం ఉండదు, ఏకాభిప్రాయం కుదరదు. అలాంటిది ఆధునిక వైద్యం విషయానికొస్తే.. వైద్యులు, వైద్య విజ్ఞాన సంస్థలు అన్నీ ఒకతాటిపైనే ఉంటాయి. అల్సర్ అయినా, ఆస్తమా అయినా.. ప్రపంచ వ్యాప్తంగా ఒకటే ట్రీట్ మెంట్, ఒకటే మందు. హార్ట్ ఆపరేషన్ అమెరికాలో చేసినా, హైదరాబాద్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేసినా ఒకటే. అక్కడా ఇక్కడా ఒకటే పద్ధతి.
కానీ కరోనా విషయానికొచ్చేసరికి ఆధునిక వైద్య విధానం కూడా గందరగోళంలో పడిపోయింది. వైద్యులు కూడా రెండు వర్గాలు కాదు.. అనేక వర్గాలుగా చీలిపోయారు. ఆ మందు మంచిదంటే, ఈ మందు మంచిదని, అది వాడకూడదని, ఇదే వాడాలని, అసలు వ్యాక్సిన్ వచ్చే వరకు ఎలాంటి మందు పనిచేయదని.. ఇలా రకరకాలుగా వాదించుకుంటున్నారు. తాజాగా మలేరియా చికిత్సకు వాడే హైడ్రో క్లోరోక్విన్ ఔషధంపై కూడా ఇలాంటి భిన్నాభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి.
కరోనా ట్రీట్ మెంట్ లో హెచ్.సి.క్యు వాడకాన్ని మొదట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తో సహా అన్ని దేశాలు సమర్థించాయి. వైద్యులు సూచించకపోయినా తను రోజూ హెచ్.సి.క్యు వాడుతున్నానని సాక్షాత్తూ అమెరికా ప్రెసిడెంటే చెప్పారు. కానీ ఇప్పుడు డబ్లూహెచ్ఓ ఎందుకో మాట మార్చింది. కరోనా నివారణకు హెచ్.సి.క్యు వాడితే దుష్ఫలితాలుంటాయని చెప్పింది. ఇకపై రోగులకు ఆ మందు ఇవ్వొద్దని సూచించింది.
అదే సమయంలో భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మాత్రం మలేరియా ఔషధాలు కరోనా నివారణకు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెబుతోంది. అయితే ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్.. లో ప్రచురితమైన పరిశోధనా ఫలితాలు మరోలా ఉన్నాయి. ఈ పరిశోధన మరింత గందరగోళానికి దారితీస్తోంది. కరోనా బాధితులకు మలేరియా మందులు పనిచేయవని, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి హెచ్.సి.క్యు ఇస్తే మృత్యు ముప్పు మరింత పెరుగుతుందని తేల్చి చెప్పింది.
కేవలం ఐసోలేషన్ వార్డుల్లో పనిచేసే సిబ్బందికి మాత్రమే మలేరియా మందులు ఇవ్వాలని, దానివల్ల వారికి కరోనా సోకే ముప్పు తగ్గుతుందని చెప్పారు పరిశోధకులు. అదే సమయంలో పీపీఈ కిట్లు తప్పనిసరిగా వాడాల్సిందేనని గుర్తు చేశారు. పీపీఈ కిట్లు వాడకపోతే హెచ్.సి.క్యు మందు పనిచేయదట. మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి? వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటే ఇక మలేరియా మందు వాడాల్సిన అవసరం ఏంటి? కరోనా వస్తే ఈ మందు ఏమీ చేయలేదని, దుష్ఫలితాలుంటాయని వైద్యులే చెబుతున్నారు, అలాంటప్పుడు అసలు దాన్ని వాడటం ఎందుకు? ఒకవేళ సిబ్బంది హెచ్.సి.క్యు వాడిన తర్వాత కరోనా వ్యాధి నిర్థారణ అయితే అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవా? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం ఐసీఎంఆర్ సమాధానం చెప్పడంలేదు.
కరోనా వచ్చిన తర్వాత, దాని నివారణకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పనిచేస్తుందనే వార్తలొచ్చాక ఆ మాత్రల ఖరీదు అమాంతం పెరిగింది. ఓ దశలో కంపెనీలను బట్టి రూ.200నుంచి రూ.500 వరకు ఉన్న బాటిల్ ధర 2500 రూపాయలకు చేరింది. అమెరికాకు హెచ్.సి.క్యు ని సప్లై చేసే సమయంలో దేశీయంగా ఉన్న ఔషధ తయారీ సంస్థలకు పండగేనని చెప్పాలి. ఓవైపు ఫలితం లేదని ప్రపంచమంతా చెబుతుంటే.. భారతీయ వైద్య పరిశోధకులు మాత్రం మలేరియా మందునే ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు?
దీని వెనక మెడికల్ మాఫియా ఉందా? లేక ప్రజా ప్రయోజనాల కోసమే ఇలా ప్రకటిస్తున్నారా? ఏది నిజమో ప్రభుత్వమే తేల్చి చెప్పాలి. ఇలాంటి గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దేశవ్యాప్తంగా కరోనా నివారణకు ఒకటే వైద్యం అందుబాటులో ఉంచాలి.