ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. పార్టీని మళ్లీ లేపాలంటే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాల్సిందే అంటున్నారు టీడీపీలోని చాలామంది నేతలు. ఎన్టీఆర్ వస్తే తప్ప టీడీపీ మనుగడ కష్టం అని తేల్చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఎన్టీఆర్ కోసం పార్టీ ఎంతగా ఎదురుచూస్తోందో చెప్పడానికి, మొన్న తారక్ పుట్టినరోజు నాడు టీడీపీ నేతలంతా ఎగబడి మరీ ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన ఉదంతం ఒక్కటి చాలు.
ఇలా పార్టీలో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ సాగుతున్న వేళ.. దానిపై బాలకృష్ణ కూడా రియాక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది అతడి ఇష్టమంటున్నాడు బాలయ్య. ఇలా అంటూనే మరోవైపు, ఎన్టీఆర్ కు చాలా సినిమా కెరీర్ ఉందంటూ సన్నాయినొక్కులు నొక్కాడు.
“తారక్ కు సినిమా భవిష్యత్తు చాలా ఉంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం. సినిమాల్ని వదిలేసి రమ్మని అడగలేం కదా. నేను సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా ఉంటూనే సినిమాలు చేశారు. పూర్తిస్థాయి రాజకీయాల గురించి మాట్లాడుకుంటే.. సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం.”
మరోవైపు కూతురు బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీపై కూడా స్పందించాడు బాలయ్య. బ్రాహ్మణికి రాజకీయాలంటే అస్సలు పడదన్నారు. పాలిటిక్స్ గురించి మాట్లాడ్డం కూడా ఆమెకు నచ్చదన్నారు.
“బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తుందని అనుకుంటున్నారు చాలామంది. తను రాజకీయాల్లోకి రాదు. తన ఎదురుగా రాజకీయాలు మాట్లాడితేనే నచ్చదు. కాకపోతే పరిస్థితుల బట్టి తను నిర్ణయం తీసుకుంటుందోమో చెప్పలేం. తనని బలవంతం పెట్టం. తన ముందు పాలిటిక్స్ మాట్లాడను.”
పెద్దల్లుడు లోకేష్, చిన్నల్లుడు శ్రీభరత్ ఎప్పటికప్పుడు తమ ఇంటికి వస్తుంటారని.. వీకెండ్స్ లో తామంతా కలుస్తామని.. అయితే రాజకీయాల గురించి మాత్రం పెద్దగా మాట్లాడుకోమని అంటున్నాడు బాలయ్య. రాజకీయంగా ఏదైనా చెప్పాలనుకుంటే చెబుతారు తప్ప దానిపై పెద్దగా చర్చలు ఉండవని అంటున్నాడు.