పరశురామ జయంతి, నృసింహ జయంతి, డొక్కా సీతమ్మ వర్థంతి, హనుమాన్ జయంతి.. పవన్ కల్యాణ్ ట్విట్టర్ చూస్తే ఇలాంటివెన్నో కనిపిస్తాయి. కేసీఆర్, చంద్రబాబుకి కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతుంటారు. మరి ఎన్టీఆర్, కృష్ణ.. పవన్ కల్యాణ్ కి ఎందుకు ఆనలేదు. పోనీ ఆయన అంత బిజీ అనుకుంటే పొరపాటే.. ఎన్టీఆర్ గురించి చిరంజీవి పెట్టిన ట్వీట్ ని సింపుల్ గా రీట్వీట్ చేసి ఊరుకున్నారు పవన్. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు విషయంలో కూడా అంతే. చిరంజీవి, రామ్ చరణ్ పెట్టిన పోస్టింగ్ లను తాను రీట్వీట్ చేశారంతే. నేరుగా మాత్రం శుభాకాంక్షలు తెలపలేదు.
పోనీ అసలు పవన్ ఈ పద్ధతి మానేశారా అనుకుంటే అదీ లేదు. ఆయనకి లోకల్ నాయకులు, సినీ స్టార్లు ఎవరూ కనిపించడం లేదు. కేవలం బీజేపీ హైకమాండ్ మాత్రమే కనిపిస్తుంటుంది. అందుకే ఇటీవల బీజేపీ జాతీయ సంయుక్త కార్యదర్శి వి.సతీష్.. కి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు పవన్. మరి అదే ట్విట్టర్ హ్యాండిల్ లో ఎన్టీఆర్ జయంతికి ఓ ట్వీట్ వేస్తే ఆయన సొమ్మేమైనా పోతుందా.
అవతల అన్నయ్య చిరంజీవి స్వీట్ మెమొరీస్ షేర్ చేసుకుని నందమూరి ఫ్యాన్స్ కి దగ్గరయ్యారు, అంతలోనే నాగబాబు కెలికేశాడనుకోండి. అది వేరే విషయం. ఇక సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా కూడా సాహసానికి మారుపేరు కృష్ణ అంటూ ఆయన్ని ఆకాశానికెత్తేశారు చిరంజీవి. భేషజాలకు పోకుండా మెగాస్టార్ ఇలా ట్వీట్లు పెడుతుంటే, పవన్ మాత్రం సైలెంట్ గా ఉండటం విమర్శలకు తావిస్తోంది.
పోనీ శుభాకాంక్షలు పెట్టకపోతే సైలెంట్ గా ఉండాలి. అన్నయ్య పెట్టిన పోస్టులు, అన్నయ్య కొడుకు చరణ్ పెట్టిన పోస్టులు రీట్వీట్ కొట్టి లేనిపోని గొడవలెందుకు. కనీసం ఎన్టీఆర్ జయంతి, కృష్ణ పుట్టినరోజన అయినా పవన్ నేరుగా వారిపై ట్వీట్లు పెడితే బాగుండేది.