లాక్ డౌన్ -5 అంటూ ఇచ్చిన మినహాయింపుల్లో భాగంగా ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలో రైలు సర్వీసులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో దేశవ్యాప్తంగా 200 రైళ్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఒక్కరోజే లక్షా 45 వేల మంది ప్రయాణికులు ఈ రైళ్లలో ప్రయాణించబోతున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో మొదటిరోజే అపశృతి చోటుచేసుకుంది. స్టేషన్ బయట స్వల్ప తొక్కిసలాట జరిగింది. భౌతికదూరం పాటించాల్సిందిగా అధికారులు ఏర్పాటుచేసిన మార్కింగ్స్ ను ప్రయాణికులు ఎవ్వరూ పట్టించుకోలేదు. తొందరగా స్టేషన్ లోకి దూరి, రైలెక్కాలనే ఆత్రుత కనిపించింది తప్ప, భౌతిక దూరం పాటించకపోతే కరోనా వస్తుందనే భయం జనాల్లో కనిపించలేదు. ఫలితంగా తోపులాటలు కనిపించాయి.
కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కర్ని పరీక్షించిన తర్వాతే స్టేషన్ లోకి అనుమతిస్తామని, కాబట్టి రైలు బయల్దేరే సమయానికి 2 గంటల ముందే స్టేషన్ కు రావాలని అధికారులు సూచించడంతో ఈరోజు ఉదయం 4 గంటల నుంచే స్టేషన్ బయట కిలోమీటర్ వరకు క్యూలైన్లు ఏర్పడ్డాయి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఎక్కేందుకు కొంతమంది రాత్రి 12 గంటల నుంచే స్టేషన్ ముందు క్యూ కట్టారు. ఈరోజు ఉదయం సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ముందుగా బయల్దేరింది ఈ ట్రైనే.
ఇక ఈరోజు సాయంత్రానికి రద్దీ మరింత ఎక్కువయ్యే అవకాశాలు స్పష్టంగా కనిస్తున్నాయి. అత్యంత రద్దీతో ప్రయాణించే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్, గోదావరి ఎక్స్ ప్రెస్, రాయలసీమ ఎక్స్ ప్రెస్ లు వివిధ సమయాల్లో సాయంత్రం బయల్దేరబోతున్నాయి. వీటిని ఎక్కేందుకు 2 గంటల ముందే స్టేషన్ కు వచ్చే ప్రయాణికుల్ని ఎలా నియంత్రించాలో అర్థంకాక అధికారులు తలలుపట్టుకున్నారు. బయట నిలబడ్డానికి ప్లేస్ లేదు, స్టేషన్ లోకి అనుమతి దొరకదు.